Manda Jannadham: మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

Former MP Manda Jagannadham is no more

  • అనారోగ్యంతో కన్నుమూసిన మందా జగన్నాథం
  • నిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మాజీ ఎంపీ
  • నాగర్ కర్నూలు నుంచి నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచిన మందా జగన్నాథం

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మందా జగన్నాథం హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. మందా జగన్నాథం నాగర్ కర్నూలు లోక్ సభ స్థానం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. మందా జగన్నాథం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ సేవలందించారు. 

మందా జగన్నాథం 1951 మే 22న జన్మించారు. ఆయన 1996, 1999, 2004, 2009లో ఎంపీగా గెలిచారు. మూడు సార్లు టీడీపీ తరఫున లోక్ సభలో అడుగుపెట్టిన ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున నెగ్గారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరారు. 

మందా జగన్నాథం మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నాగర్ కర్నూలు ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారుడిగా మందా జగన్నాథం కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. 

అటు, మందా జగన్నాథం మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. మందా జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. పేద కుటుంబం నుంచి వచ్చి పెద్ద చదువులు చదివారని, తెలుగుదేశం పార్టీ తరఫున మూడు సార్లు ఎంపీగా గెలిచారని చంద్రబాబు వెల్లడించారు. ఈ విషాద సమయంలో మందా జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు.

  • Loading...

More Telugu News