RN Ravi: అంత అహంకారం మంచిది కాదు: సీఎం స్టాలిన్ పై గవర్నర్ ఫైర్
- తమిళనాడు సర్కారుకు, గవర్నర్ కు మధ్య మాటల యుద్ధం
- స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన గవర్నర్
- దేశాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించని నేత అంటూ స్టాలిన్ పై గవర్నర్ విమర్శలు
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడు అభివృద్ధిని చూస్తుంటే గవర్నర్ కు మింగుడుపడడంలేదని, ఇటీవల అసెంబ్లీకి వచ్చి కూడా ప్రసంగించకుండా వెళ్లిపోయారని సీఎం స్టాలిన్ ఆరోపించారు. గవర్నర్ చర్యలు చిన్న పిల్ల చేష్టల్లా ఉన్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో, గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా మాటల్లో పదును పెంచారు. తమిళనాడు రాజ్ భవన్ సోషల్ మీడియా ఖాతా నుంచి ఘాటైన ట్వీట్ వెలువడింది.
జాతీయ గీతాన్ని గౌరవించాలని, రాజ్యాంగం పేర్కొంటున్న ప్రాథమిక విధులను పాటించాలని చెబితే దాన్ని అసంబద్ధమని, చిన్న పిల్లల చేష్టలు అని సీఎం స్టాలిన్ మాట్లాడుతున్నారని ఆ ట్వీట్ లో మండిపడ్డారు. దేశమే సర్వోన్నతమైనది, రాజ్యాంగమే అత్యున్నత విశ్వాసం అనే విషయాలను గ్రహించకుండా... భారత్ ను ఓ దేశంగా గుర్తించని రీతిలో, దేశ రాజ్యాంగాన్ని కూడా అగౌరవపరుస్తున్నారంటూ స్టాలిన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. అంత అహంకారం మంచిది కాదు అని గవర్నర్ ఆర్ఎన్ రవి హితవు పలికారు.
ఇటీవల నూతన సంవత్సరాది సందర్భంగా తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశం వేళ... జాతీయగీతం ఆలపించలేదన్న కారణంతో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. దాంతో, రాజ్ భవన్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరింత ముదిరాయి.