Anita Indira Anand: కెనడా ప్రధాని రేసు నుంచి తప్పుకున్న భారత సంతతి మహిళ అనిత
- కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన జస్టిన్ ట్రూడో
- ప్రధాని పదవి రేసులో అనిత ఇందిరా ఆనంద్
- అనూహ్యరీతిలో పోటీ నుంచి వైదొలగిన అనిత
- ఇకపై ఎంపీగా కూడా పోటీచేయబోనని వెల్లడి
కెనడా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు భారత సంతతి మహిళా నేత, ప్రస్తుత రవాణా శాఖ మంత్రి అనిత ఇందిరా ఆనంద్ ప్రకటించారు. ఇటీవల ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిన్ ట్రూడో ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో తదుపరి ప్రధాని రేసులో అనిత కూడా ఉన్నారు. పీఎం రేసులో తుది ఐదు మంది నేతల్లో ఆమె ఒకరు.
ఇప్పుడు అనూహ్య రీతిలో ఆమె రేసు నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, మళ్లీ ఎంపీగా పోటీ చేయనని సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్తులో విద్యారంగంలో సేవలు అందించాలని కోరుకుంటున్నానని అనిత తెలిపారు. తదుపరి ఎన్నికలు జరిగే వరకు పదవీ బాధ్యతల్లో కొనసాగుతానని వెల్లడించారు.
57 ఏళ్ల అనిత ఆనంద్ తమిళ, పంజాబీ మూలాలున్న వ్యక్తి. ఆమె తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్, తల్లి పంజాబ్ కు చెందిన మహిళ. అనిత 2019లో కెనడాలోని ఓక్ విల్లే పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. ట్రూడో క్యాబినెట్ లో తొలుత ప్రజా సేవల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రవాణా మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు.