Revanth Reddy: అవసరం ఉన్న చోట విపక్ష నేతల అనుభవాన్ని ఉపయోగించుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి

- మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం
- హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
- తాను ఎవరి సలహాలైనా స్వీకరిస్తానన్న సీఎం
- తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టీకరణ
మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆత్మకథ 'ఉనిక' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ... విపక్ష నేతలు అయినా సరే, వారి అనుభవం అవసరం అనుకుంటే తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు రాష్ట్రాల్లో అధికార, విపక్షాలు అని తేడా లేకుండా అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడుతున్నాయని అన్నారు. తనకు ఎటువంటి భేషజాలు ఉండవని, ఎవరి నుంచైనా సలహాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. విద్యాసాగర్ రావు వంటి వ్యక్తుల అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందేలా పాటుపడుతున్నామని అన్నారు. మనం పోటీ పడాల్సింది అమరావతితో కాదని... ప్రపంచ నగరాలతో అని తమ వైఖరిని చాటిచెప్పారు. కేంద్రం చేయూత అందిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి పరిపూర్ణమవుతుందని... మెట్రో, ఆర్ఆర్ఆర్ అంశాల్లో సహకారం అందించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశానని రేవంత్ వెల్లడించారు.