Sankranti: హైదరాబాద్ నుంచి బైక్ లపై సొంతూళ్లకు వెళుతున్న కోస్తాంధ్ర వాసులు
- సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న వలసజీవులు
- ఆర్టీసీ బస్సులు, స్పెషల్ రైళ్లలో కిటకిట
- ట్రావెల్స్ బస్సుల్లో అధిక చార్జీలు
- కార్లు లేని వాళ్లు కుటుంబాలతో బైక్ పైనే ప్రయాణం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గత రెండ్రోజులతో పోల్చితే వాహనాల రద్దీ ఇవాళ కొంచెం తగ్గింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన సెంటర్లలో స్వల్పంగా రద్దీ తగ్గుముఖం పట్టింది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ మధ్యాహ్నం వాహనాల రద్దీ ఓ మోస్తరుగా ఉంది.
కాగా, ఆర్టీసీ స్పెషల్ బస్సులు, ప్రత్యేక రైళ్లు క్రిక్కిరిసిపోయి ఉండడం, ట్రావెల్స్ బస్సుల్లో చార్జీలు మోత మోగుతుండడం, ప్రైవేటు వాహనాలకు అధికంగా చెల్లించాల్సి రావడం, సొంత కార్లు లేకపోవడం వంటి కారణాలతో... కోస్తాంధ్ర వలస జీవులు కుటుంబాలతో సహా బైక్ లపై సొంతూళ్లకు పయనమవుతున్నారు.
హైదరాబాద్-విజయవాడ-కోల్ కతా జాతీయ రహదారులపై బైక్ ప్రయాణాలు పెరిగాయి. ఆయా రహదారులపై కార్ల కంటే బైకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ బైకులపై పిల్లాపాపలతో దంపతులు ప్రయాణిస్తున్న దృశ్యాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. హైదరాబాదు నుంచి ఏపీకి బైకులపై ప్రయాణించే కొందరిని మీడియా పలకరించగా, తగినన్ని ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో బైకులపై వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు.
కాగా, హైదరాబాద్-విజయవాడ హైవేపై నందిగా-ఐతవరం మధ్య రోడ్డును వెడల్పు చేస్తున్నారు. రోడ్డు పనుల కారణంగా వాహనాలు కిలోమీటర్ల మేర నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతోందని వాహనదారులు అంటున్నారు.