Naxalite Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో మరో ఎన్‌కౌంటర్... ముగ్గురు నక్సల్స్ మృత్యువాత

Three Naxalites killed in encounter in Bijapur district of Chhattisgarh on Sunday

  • బీజాపూర్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
  • ఘటనా స్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు గుర్తింపు
  • ఇంకా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. ఇంద్రావతి నేషనల్ పార్క్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల సంయుక్త బృందం యాంటి-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టిందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. 

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), డిస్ట్రిక్ట్ ఫోర్స్‌కు చెందిన సిబ్బంది ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించారని, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని సుందర్‌రాజ్ వివరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించామని తెలిపారు. చనిపోయిన ముగ్గురు మావోయిస్టులు యూనిఫామ్‌లో ఉన్నారని వివరించారు.

కాగా, ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. గతేడాది నవంబర్ నుంచి నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. 2025లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో కలిపి ఇప్పటికే 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో అటవీప్రాంతంలో మూడు రోజులపాటు జరిగిన యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు నక్సల్స్ చనిపోయారు. జనవరి 6న ఈ ఆపరేషన్ ముగిసింది.

ఇక జనవరి 9న సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. జనవరి 3న రాయ్‌పూర్ డివిజన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ హతమయ్యాడు. గతేడాది 2024లో రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 219 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

  • Loading...

More Telugu News