Danam: నేనేం మాట్లాడినా సెన్సేషనే అవుతోంది: దానం నాగేందర్

Danam Nagender Sensational Comments On KTR And Hydraa

  • కేటీఆర్ కు తాను క్లీన్ చిట్ ఇవ్వలేదని వ్యాఖ్య
  • ఫార్ములా కార్ రేస్ తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని చెప్పానన్న ఎమ్మెల్యే
  • హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిందనే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడి

ఫార్ములా ఈ కార్ రేస్ తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో ఈ రేస్ లో అవినీతి జరగలేదని తాను చెప్పడంలేదని, మాజీ మంత్రి కేటీఆర్ కు తానేమీ క్లీన్ చిట్ ఇవ్వలేదనే విషయం గుర్తించాలని చెప్పారు. తాను ఏం మాట్లాడినా సంచలనమే అవుతోందని అన్నారు. హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిందనేది వాస్తవమని వివరించారు. హైడ్రా విషయంలో పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని, ఈ విషయంలో తన అభిప్రాయం మారదని చెప్పారు.

తాను ఓ ఫైటర్ అని, ఉప ఎన్నికకు భయపడనని తేల్చిచెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూసీ వ్యవహారంపై కంటి తుడుపు చర్యలాగా బీజేపీ నేతలు ఒక్కరోజు నిద్ర చేశారని, అక్కడికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకున్నారని విమర్శించారు. స్థానికులు చేసిన జొన్న రొట్టెలు కాకుండా కిషన్ రెడ్డి బయటి నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారని ఆరోపించారు. ఓ ఇంటర్వ్యూలో హైడ్రాపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు.

ఫార్ములా కార్ రేస్ నిర్వహించేందుకు అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ తనను కూడా సలహా అడిగారని దానం నాగేందర్ చెప్పారు. ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుందని తన అభిప్రాయం చెప్పానని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నందున ఎక్కువగా మాట్లాడబోనని వివరించారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, రైతు రుణ భరోసా అమలు చేసిన రోజు సంబరాలు జరపాల్సిందని దానం అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News