Rohit Sharma: కొత్త కెప్టెన్‌ను అన్వేషించుకోండి... బీసీసీఐ పెద్దలకు తేల్చిచెప్పేసిన రోహిత్ శర్మ!

The BCCI has been asked by Rohit to keep searching for a new captain

  • కొన్ని నెలలపాటు కెప్టెన్‌గా కొనసాగుతానంటూ స్పష్టత ఇచ్చిన హిట్‌మ్యాన్
  • తన వారసుడిగా స్టార్ పేసర్ బుమ్రా పేరుని సూచించిన రోహిత్ శర్మ
  • టెస్టుల్లో వరుస ఓటములపై శనివారం సమీక్ష నిర్వహించిన బీసీసీఐ
  • బీసీసీఐ పెద్దల ముందు సుదీర్ఘంగా మాట్లాడిన రోహిత్
  • ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలో బుమ్రా కెప్టెన్సీ సందేహాలు వెలిబుచ్చిన ఉన్నతాధికారులు

రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్, కెప్టెన్సీపై జోరుగా ఊహాగానాలు వెలువడుతున్న వేళ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టెస్ట్ ఫార్మాట్ జట్టుకు మరికొన్ని నెలలపాటు కెప్టెన్‌గా కొనసాగాలని భావిస్తున్నానని, ఈ సమయంలో కొత్త సారథిని అన్వేషిస్తూ ఉండాలంటూ బీసీసీఐ పెద్దలకు హిట్‌మ్యాన్ తేల్చిచెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర వైఫల్యంపై శనివారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు హిట్‌మ్యాన్ తన అభిప్రాయాలను వెలిబుచ్చినట్టుగా బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో ఓటమి, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అవమానకర రీతిలో వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో బీసీసీఐ ఈ సమీక్షను నిర్వహించింది. వరుస వైఫల్యాలపై జట్టు మేనేజ్‌మెంట్ వివరణ ఇవ్వాలని కోరడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా హాజరయ్యారు. బీసీసీఐ ఉన్నతాధికారుల ముందు రోహిత్ శర్మ సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. మరికొన్ని నెలల పాటు జట్టు కెప్టెన్‌గా కొనసాగాలనే తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాడని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

బుమ్రా పేరు సూచించిన రోహిత్
టీమిండియా టెస్ట్ ఫార్మాట్ తదుపరి కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరుని రోహిత్ శర్మ ప్రతిపాదించాడంటూ ‘దైనిక్ జాగరణ్‌’ కథనం పేర్కొంది. అయితే, బుమ్రా విషయంలో కొందరు బీసీసీఐ పెద్దలు సందేహాలు వ్యక్తం చేశారని, ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌లో జట్టును నడిపించగల ఫిట్‌నెస్ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారని తెలిపింది. వరుస గాయాలు, ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సిడ్నీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో సారథిగా జట్టుని నడిపించినప్పటికీ వెన్నునొప్పి కారణంగా మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక కెప్టెన్సీపై బీసీసీఐ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

More Telugu News