Honour Killing: యూపీలో పరువు హత్యలు.. మూడేళ్ల పాప సహా వృద్ధురాలిని చంపిన దుండగులు

- పదేళ్ల క్రితం పక్కింటి యువకుడితో పారిపోయిన కూతురు
- పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం పెట్టిన జంట
- ఆ జంటకు పుట్టిన బిడ్డను, యువకుడి తల్లిని హత్య చేసిన తండ్రీకొడుకులు
పక్కింటి యువకుడితో కూతురు పారిపోవడాన్ని తలవంపులుగా భావించిందా కుటుంబం.. పదేళ్లు గడిచినా వారిలో ప్రతీకార వాంఛ తగ్గలేదు. అదునుచూసి మూడేళ్ల పాపను, 55 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా హతమార్చారు. ఆ పసికందు తమ కూతురు సంతానమేనని కూడా పట్టించుకోలేదు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని హయత్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామ్ నాథ్, ప్రేమ్ పాల్ ఇద్దరూ ఒకే కమ్యూనిటికి చెందిన వారు. పదేళ్ల క్రితం ప్రేమ్ పాల్ కూతురు ఆశాదేవి రామ్ నాథ్ కొడుకు విజయ్ కుమార్ తో పారిపోయింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం పెట్టారు. కూలీపని చేసుకుంటూ బతుకుతున్నారు.
మూడేళ్ల క్రితం ఈ జంటకు కూతురు పుట్టగా కల్పన అని నామకరణం చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తుండడంతో కల్పనకు ఆరు నెలలు నిండగానే తీసుకెళ్లి నాయనమ్మకు అప్పగించారు. అప్పటి నుంచి కల్పన హయత్ నగర్ లో తాత రామ్ నాథ్, నాయనమ్మ గీతాదేవి వద్ద పెరుగుతోంది. అయితే, కూతురు ఆశాదేవి లేచిపోయి పెళ్లి చేసుకోవడం తమ కుటుంబానికి అవమానంగా భావించిన ప్రేమ్ పాల్ పగతో రగిలిపోయాడు. పదేళ్లు గడిచిపోయినా ప్రేమ్ పాల్ కుటుంబంలో ప్రతీకార వాంఛ తగ్గలేదు. ఈ క్రమంలోనే రామ్ నాథ్ లేని సమయంలో ఆయన భార్య గీతాదేవిని, మనవరాలు కల్పనను ప్రేమ్ పాల్, ఆయన కొడుకు కలిసి దారుణంగా హత్య చేశారు. కల్పన తనకూ మనవరాలేననే విషయం కూడా ప్రేమ్ పాల్ పట్టించుకోలేదు. ఈ హత్యలపై విజయ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.