Girl As Donation: బాలికను దానంగా స్వీకరించిన మహంత్.. మహంత్ ను బహిష్కరించిన అఖాడా

- తమ కూతురిని సన్యాసినిగా మార్చేందుకు దానమిచ్చిన తల్లిదండ్రులు
- జునా అఖాడాలో చేర్చుకుని సన్యాసినిగా మార్చిన మహంత్ కౌశల్ గిరి
- నిబంధనలకు విరుద్ధమంటూ ఇద్దరినీ బహిష్కరించిన అఖాడా
ప్రయాగ్ రాజ్ లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న మహా కుంభమేళాలో పాల్గొనేందుకు దేశం నలుమూలలకు చెందిన సాధుసన్యాసులు వస్తున్నారు. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమం ఒడ్డున టెంట్లు ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ కు చెందిన పదమూడేళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఓ సాధువుకు దానమిచ్చారు. తమ కూతురిని సన్యాసినిగా మార్చాలని కోరారు. వారి నుంచి దానం స్వీకరించిన సాధువు.. ఆ బాలికను తమ అఖాడాలో చేర్చుకుని సన్యాసినిగా మార్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మీడియా కథనాలు ప్రచురించింది. బాలిక రేఖకు జునా అఖాడాకు చెందిన మహంత్ కౌశల్ గిరి సన్యాసిని దీక్షను ప్రసాదించారు. ఈ విషయం తెలిసి జునా అఖాడా హెడ్ స్వామి అవదేశ్వరానంద్ గిరి జి మహారాజ్ స్పందించారు. పదమూడేళ్ల బాలికను అఖాడాలో చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమని, బాలికకు సన్యాస దీక్ష ఇవ్వడమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. బాలికను దానంగా పుచ్చుకున్న మహంత్ కౌశల్ గిరిని, అఖాడాలో చేరి సన్యాస దీక్ష తీసుకున్న బాలిక రేఖను జునా అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై వారిద్దరికీ అఖాడాతో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.