travel agencies: చార్జీల మోత మోగిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్!

- సంక్రాంతి రద్దీతో టికెట్ ధరలు విపరీతంగా పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు
- టికెట్ ధర కంటే మూడు నాలుగింతలకుపైగా వసూలు
- సొంతూళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
తెలుగు ప్రజల అత్యంత పెద్ద పండుగ సంక్రాంతి. పండుగపూట సొంతూరికి వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులతో నాలుగు రోజుల పాటు ఆనందంగా గడపాలని భావిస్తున్న వారికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సొంతూళ్లకు క్యూకడుతుండటంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నా అవి కూడా నిమిషాల వ్యవధిలో నిండిపోతున్నాయి. దీంతో ప్రయాణీకులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.
ప్రయాణీకుల రద్దీ, డిమాండ్ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఇబ్బడి ముబ్బడిగా టికెట్ ధరలను పెంచేసి ప్రయాణీకులను దోపిడీ చేస్తున్నారు. ప్రైవేటు బస్సుల టికెట్ ధరలు చూస్తే విమానం మోత మోగుతోంది. సాధారణ టికెట్ ధర కంటే మూడింతలు, నాలుగింతలు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లే ఏసీ స్లీపర్ బస్సుల్లో టికెట్ ధర రూ.4వేలు ఉండేది. అయితే ఇప్పుడు రూ.6 వేలకుపైగానే ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లు వసూలు చేస్తున్నారు. అలాగే సాధారణ రోజుల్లో ఏసీ సీటర్ బస్సులో గరిష్టంగా రూ.1,849 వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు రూ.5,500 లకుపైగా వసూలు చేస్తున్నారు. అదే వోల్వో బస్సు అయితే ఏకంగా రూ.7 వేలు చెల్లించాల్సి వస్తుంది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వోల్వో బస్సు ప్రయాణానికి రూ.4 వేలు చెల్లించాల్సి వస్తుందని ప్రయాణీకులు వాపోతున్నారు. ఈ ట్రావెల్ ఏజన్సీల దందా చాటుమాటుగా ఏమీ జరగడం లేదు. మొబైల్ యాప్స్, వెబ్‌సైట్లలో టికెట్ ధరలను స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ ధరలను భారీగా పెంచేసి ప్రయాణీకులను దోపిడీ చేస్తున్నా అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. పండుగ దగ్గర పడటంతో గత్యంతరం లేక ప్రయాణీకులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో అత్యధిక ధరలను చెల్లించి సొంతూళ్లకు పయనమవుతున్నారు.