Pakistan: పాకిస్థాన్ పంట పండినట్టే.. సింధునది లోయలో 33 టన్నుల బంగారం నిల్వలు!
- పంజాబ్ ప్రావిన్సులోని అటోక్ జిల్లాలో సింధు నది లోయ
- 32 కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న బంగారు నిల్వలు
- దేశానికి మంచి రోజులు వచ్చినట్టేనంటున్న నిపుణులు
- త్వరలోనే వెలికతీత ప్రారంభం అవుతుందన్న మంత్రి
చూస్తుంటే పాకిస్థాన్ పంట పండినట్టే ఉంది. పంజాబ్ (పాక్) ప్రావిన్సులోని అటోక్ జిల్లాలో ఉన్న సింధు నది (ఇండస్ రివర్) లోయలో 32.6 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ. 18 వేల కోట్లు (600 బిలియన్ పాకిస్థానీ రూపాయలు) ఉంటుందని అంచనా. సింధు లోయలో కనకపు నిల్వలు భారీగా ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (జీఎస్‌పీ) కూడా నిర్ధారించింది.
ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు ఈ దెబ్బతో ఇక మంచి రోజులు వచ్చినట్టేనని భావిస్తున్నారు. పాక్ భవిష్యత్తుకు ఇది శుభపరిణామమేనని అంటున్నారు. బంగారం నిల్వల వెలికితీత ప్రారంభమైతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, దేశంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు కూడా ఇది సాయపడుతుందని అంటున్నారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభించే అవకాశం ఉంది.
సింధునదిలో 32 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బంగారం నిల్వల వెలికితీత ప్రక్రియపై దృష్టి పెట్టినట్టు పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు. అంతేకాదు, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోనూ బంగారం నిల్వలను గుర్తించినట్టు పేర్కొన్నారు.