Nadendla Manohar: మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా: మంత్రి నాదెండ్ల

Nadendla Manohar inaugurates Mini Gokulam Sheds in Athota village

  • తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల పర్యటన
  • అత్తోట గ్రామంలో నిర్మించిన మినీ గోకులం షెడ్ల ప్రారంభోత్సవం
  • పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల ప్రారంభం

తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో నూతనంగా నిర్మించిన మినీ గోకులం షెడ్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ మినీ గోకులం షెడ్లను నిర్మించారు. అలాగే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల పశువులకు గ్రాసం వేసి కొంతసేపు వాటితో గడిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నేడు మినీ గోకులం షెడ్లను ప్రారంభించామని తెలిపారు. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక బాసట, ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈ పథకంలో రైతులు 10% ఏర్పాటు చేసుకుంటే, ప్రభుత్వం 90% సబ్సిడీ అందిస్తోందని వివరించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని నాదెండ్ల తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో గుంతలు పూడ్చే పనులు కూడా నిర్వహించలేని పరిస్థితి ఉండేదని విమర్శించారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గత ఏడాది పల్లెల్లో రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గం లో గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం మరో 25 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని మంత్రి తెలిపారు. 

ఇక, మంత్రి నాదెండ్ల అత్తోట గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు భోగి పండ్లు పోసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News