Revanth Reddy: బీర్ల ధర పెంపు కోసం యూబీఎల్ ఒత్తిడి... రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

- ఎక్సైజ్ శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమావేశం
- యూబీఎల్ బీర్ల ధరల పెంపు కోసం ఒత్తిడి చేసిందన్న అధికారులు
- కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
బీరు ధరను 33.1 శాతం పెంచాలని యూబీఎల్ కంపెనీ ఒత్తిడి చేసిన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూబీఎల్ బీర్ల ధరల పెంపు కోసం ఒత్తిడి చేసిందంటూ సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాలలో బీర్ల ధరలను పరిశీలించాలన్నారు. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ నివేదిక మేరకు మాత్రమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నట్లు చెప్పారు.
గత బీఆర్ఎస్ పెట్టిన బకాయిలను క్రమంగా చెల్లిస్తున్నామన్నారు. మద్యం సరఫరా కంపెనీల ఎంపికలో పారదర్శకత విధానం పాటించాలని సూచించారు. కొత్త బ్రాండ్ల సరఫరాకు సులభతర వాణిజ్య విధానాన్ని అనుసరించాలన్నారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలను అనుమతించే క్రమంలో నిబంధనలు పాటించాలని సూచించారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వాలని, నెల రోజుల సమయం ఇచ్చి బ్రాండ్ల పేరుతో దరఖాస్తులు స్వీకరించాలన్నారు.