Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా స్పెషల్ షోలకు అనుమతులు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

- గేమ్ ఛేంజర్ సినిమాను స్పెషల్ షోకు తొలుత అనుమతి
- బెనిఫిట్ షో రద్దు చేశామని.. స్పెషల్ షోకు అనుమతి ఏమిటని హైకోర్టు ప్రశ్న
- స్పెషల్ షోకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. గేమ్ ఛేంజర్ సినిమా మార్నింగ్ స్పెషల్ షోకు తొలుత తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతించిన ఈ మార్నింగ్ స్పెషల్ షోను తాజాగా రద్దు చేసింది. ఈ మేరకు శనివారం నాడు తెలంగాణ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గేమ్ ఛేంజర్ టిక్కెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలను రద్దు చేశామని చెప్పి, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేమిటని ప్రశ్నించింది. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంపై పునరాలోచన చేయాలని సూచించింది.
ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని... బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వవద్దని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం స్పెషల్ షోకు అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.