K Kavitha: రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారు: కవిత

- కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉన్నాయని విమర్శ
- రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని వ్యాఖ్య
- బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి పిరికిపంద చర్య అని విమర్శ
సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారని, దాడులకు తెగబడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉన్నాయని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనపై కవిత స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈ దాడి పిరికిపంద చర్య అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్న మొహబ్బత్ కీ దుకాన్ ఇదేనా? అని ప్రశ్నించారు. ఇలాంటి హింసా రాజకీయాలను తెలంగాణ తిరస్కరిస్తుందన్నారు. హింసకు, విధ్వంసకర చర్యలకు తెలంగాణలో తావులేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తన యువజన విభాగాన్నిగూండాల విభాగంగా తీర్చిదిద్దుతోందన్నారు. ఇలాంటి సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.