Anand Mahindra: 10 గంటల్లో ప్రపంచాన్ని మార్చేయొచ్చు: ఆనంద్ మహీంద్రా
- ఢిల్లీలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2025 సదస్సు
- హాజరైన ఆనంద్ మహీంద్రా
- వారానికి 70-90 గంటలు పనిచేయాలన్న నారాయణమూర్తి వ్యాఖ్యలపై స్పందన
- నాణ్యతో కూడిన పని కొన్ని గంటలు చేసినా చాలన్న ఆనంద్
ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2025 సదస్సులో ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్వాలిటీ వర్క్ అవసరమని అన్నారు. ఎంత పనిచేశారన్నది ముఖ్యం కాదు... ఎంత నాణ్యతతో పనిచేశారన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. పని-పని గంటలు-సమతుల్యత అనే టాపిక్ పై ఆనంద్ మహీంద్రా ప్రసంగించారు.
రోజులో అధిక గంటలు పనిచేయాలన్న ఇటీవల ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. "నాకు నారాయణమూర్తి గారన్నా, ఇతర కార్పొరేట్ దిగ్గజాలన్నా చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే... ఎంతసేపు పనిచేశావన్నది ముఖ్యం కాదు... పనిలో నాణ్యత ముఖ్యం. అందుకే వారంలో 70 గంటలు, 90 గంటలు పనిచేయడం కంటే... నాణ్యత కూడిన పని చేయడంపై దృష్టి సారించాలి. నాణ్యమైన పని 10 గంటలు చేసినా చాలు... ప్రపంచాన్నే మార్చేయొచ్చు" అని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు.
ఉద్యోగులు రోజులో ఎన్ని గంటలు పనిచేస్తే బాగుంటుందన్న ప్రశ్నకు కూడా ఆనంద్ బదులిచ్చారు. "ఇది రోజులో ఇన్ని గంటలే పనిచేయాలన్న టైమ్ కు సంబంధించిన విషయం కాదు. పనిలో నాణ్యత ఎలా ఉండాలన్న దాని గురించి నన్నడగండి... నేను చెబుతాను. కచ్చితంగా ఇన్ని గంటలు పనిచేయాలని మాత్రం నేను చెప్పను" అని స్పష్టం చేశారు.
ఇక, ఈ వయసులోనే ఎంతో ఎనర్జిటిక్ గా ఎలా పనిచేస్తారన్న ప్రశ్నకు ఆనంద్ ఏమన్నారంటే... యువతతో మాట్లాడడం ద్వారా నా బ్యాటరీలను చార్జ్ చేసుకుంటాను... యువతరం ప్రతినిధులతో మాట్లాడితే కొత్త ఉత్తేజం కలుగుతుంది, అదే తనను నడిపిస్తుందని అన్నారు.