Pawan Kalyan: ఇంత భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan visits Green Co Solar Park on Orvakallu in Kaurnool district

  • కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ కో సోలార్ పార్క్
  • ప్రాజెక్టును సందర్శించిన పవన్ కల్యాణ్
  • తొలుత ఏరియల్ వ్యూ... తర్వాత రోడ్డు మార్గం ద్వారా పరిశీలన

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించారు. ఇక్కడి గ్రీన్ కో సోలార్ పార్క్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.  సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు సైట్ లను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఏరియల్ వ్యూ అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టును సందర్శించారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 2,800 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఇంత భారీ ప్రాజెక్టును మన రాష్ట్రంలో నిర్మిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇటువంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదని వెల్లడించారు. 

సోలార్ పవర్ రంగంలో గ్రీన్ కో కంపెనీకి అంతర్జాతీయస్థాయిలో మంచి పేరుందని తెలిపారు. గ్రీన్ కో మన దేశంలో లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోందని, అందులో భాగంగా మన రాష్ట్రంలో రూ.35 వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని వివరించారు. గ్రీన్ కో సోలార్ పవర్ కంపెనీ ద్వారా లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

కాగా, ఈ ప్రాజెక్టు భూమి విషయంలో రెవెన్యూ, అటవీశాఖ మధ్య చిన్న వివాదం ఏర్పడిందని తెలిపారు. ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. 

భవిష్యత్తులో గ్రీన్ కో సోలార్ పార్క్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రం కానుందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా తగిన సహకారం అందించాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, ఈ ప్రాజెక్టు వల్ల జిల్లాకు, రాష్ట్రానికే కాదు... దేశానికి కూడా మంచి పేరొస్తుందని తెలిపారు. 

ఇక, సీఎస్ఆర్ నిధుల ద్వారా సంస్థ పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నానని అన్నారు. పాఠశాలలు, సేంద్రియ సాగు, గోవుల సంతతి పెంచేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News