Bhumana Karunakar Reddy: జగన్ వస్తున్నారని తెలిసి కూడా అంతసేపు పవన్ కల్యాణ్ అక్కడెందుకు ఉన్నారు?: భూమన కరుణాకర్ రెడ్డి

- జగన్ వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకున్నారని భూమన మండిపాటు
- ప్రభుత్వాన్ని తిట్టించడానికి తాము డబ్బులు ఇచ్చామని ఆనం అనడం దారుణమని వ్యాఖ్య
- జగన్ వచ్చేంత వరకు తమను ఆసుపత్రిలోకి కూడా అనుమతించలేదన్న భూమన
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శించేందు వెళ్లిన సమయంలో అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఉండటంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ వస్తునన్నారని తెలిసి కూడా అంతసేపు పవన్ అక్కడెందుకున్నారని ప్రశ్నించారు. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా? అని ప్రశ్నించారు. జగన్ ఆసుపత్రికి రాకుండా కుట్ర చేసింది నిజం కాదా? అని అడిగారు.
మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకున్నారని భూమన మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి కనీస భద్రత ఇవ్వాలని కూడా తెలియదా? అని ప్రశ్నించారు. జగన్ పరామర్శ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని అన్నారు.
తొక్కిసలాట బాధితులను పరామర్శించి, వారికి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి... జగన్ రావడానికి ముందు తాము వారికి డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని తిట్టించడానికి వాడుకున్నామని ఆనం అనడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. మీ అస్తిత్వానికి ఇబ్బంది వస్తుందని ఇలాంటి ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు. తాము డబ్బులు ఇచ్చినట్టు నిరూపించాలని... లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. వాస్తవానికి జగన్ వచ్చేంత వరకు తమను ఆసుపత్రి వైపు పోలీసులు, అధికారులు వెళ్లనీయలేదని చెప్పారు.