Sankranti-2025: సంక్రాంతి ప్రయాణికుల చేరవేతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి
- సొంతూళ్లకు పయనమవుతున్న ప్రజలు
- అవసరమైతే ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను ఉపయోగించుకోవాలన్న సీఎం
- ప్రయాణికుల రద్దీ ఉండే రూట్లలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీ బస్సులు తిప్పాలని సూచన
సంక్రాంతి శోభతో తెలుగు వారి లోగిళ్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారు సంక్రాంతి వేడుకల కోసం స్వస్థలాలకు వస్తున్నారు. ముఖ్యంగా, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏపీకి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఆర్టీసీ బస్సులు సరిపోకపోతే... ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలకు చెందిన బస్సులను కూడా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. ప్రయాణికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సుల సాయంతో ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపించే ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. అయితే, ఫిట్ నెస్ ఉన్న బస్సుల్లోనే ప్రయాణికులను పంపించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ బస్సులన్నీ ఆర్టీసీ ద్వారా నడిపి ప్రజలకు ప్రయాణ కష్టాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు.
చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన సూచన పట్ల ఆయన వెంటనే స్పందించి పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు చిట్ చాట్ లో ముఖ్యాంశాలు...
• రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు... ఈసారి మరింత ఎక్కువ పండుగ సందడి కనిపిస్తోంది.
• పొరుగు రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర పరిధిలో అదనపు రవాణా సౌకర్యాలు తీసుకువస్తున్నాం.
• రోడ్ల మరమ్మతుల విషయంలో చాలా వరకు మార్పు తేగలిగాం.
• వచ్చే నెలాఖరు నాటికి గుంతలు లేని రహదారుల పనులు పూర్తి చేస్తాం.
• దశల వారీగా అన్ని రహదారుల పనులు పూర్తి చేస్తాం... ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పిస్తాం.
• రాష్ట్రంలో పెట్టుబడుల రాక ఉత్సాహాన్నిస్తోంది. గ్రీన్ ఎనర్జీలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులు గొప్ప ముందడుగు. ఒక్క క్లీన్ ఎనర్జీలోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి.
• రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంపై రాష్ట్రాన్ని మార్కెట్ చేసేందుకు దావోస్ పర్యటన ఉపయోగపడుతుంది.
• ప్రపంచ స్థాయి సంస్థలతో నెట్‌వర్క్ అవడం ద్వారా మన దగ్గర ఉన్న అవకాశాలను అందరికీ తెలిసేలా చేయవచ్చు... తద్వారా పెట్టుబడులకు అవకాశం.
• గ్రీన్ ఎనర్జీ, బయో ఫ్యూయల్స్ రంగంలో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాం.
• రానున్న రోజుల్లో రాష్ట్రంలో 5 వేల ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం.
• రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయో కంప్రెస్డ్ గ్యాస్ ద్వారా రైతులకు ఎకరానికి రూ.30 వేలు కౌలు లభిస్తుంది. తరువాత ఆ వ్యర్థాలు ఎరువులగానూ ఉపయోగపడుతాయి.
• కుప్పంలో ప్రతి ఇంటికీ పీఎం సూర్యఘర్ కార్యక్రమం చేపట్టాం. రాష్ట్రమంతటా దీన్ని విస్తరిస్తాం. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీతో సూర్యఘర్ కార్యక్రమం చేపడతాం.
• ఇతర వర్గాల ప్రజలకు ప్రభుత్వ పెట్టుబడితోనే పథకం అమలుకు ఆలోచన చేస్తున్నాం. పెట్టుబడి తిరిగి వచ్చే వరకు ఆ విద్యుత్‌లో కొంత భాగాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది.
• రెండు కిలోవాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ.1.15 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో కేంద్ర సబ్సిడీ పోగా మిగిలింది లబ్ధిదారులు భరించాలి.
• సోలార్‌తో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కొంత కాలం ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా 100 శాతం సబ్సిడీ వచ్చేలా ప్రణాళిక రచిస్తున్నాం.
• సోలార్ విద్యుత్‌తో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆదాయం పొందే పైలట్ ప్రాజెక్టును ఇటీవల కుప్పంలో ప్రారంభించాం.
• ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ స్వాపింగ్ విధానం ద్వారా ప్రతి ఒక్కరూ ఆదాయం పొందవచ్చు. ఇది సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అవుతుంది. కుప్పంలో దీన్ని పైలట్‌గా చేపడుతున్నాం.
• గ్రామ, వార్డు సచివాలయాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. మిగులు ఉద్యోగులను సంబంధిత శాఖలకు పంపుతాం
• ప్రజలకు సంబంధించిన డేటా ద్వారా వారికి నేరుగా సంక్షేమ కార్యక్రమాలు, జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపడతాం.
• ప్రతి ఇంటినీ జియోట్యాగ్ చేసి... ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు యూనిట్‌గా కార్యక్రమాలు చేపడతాం.
• డ్రోన్, ఏఐ, ఐఓటి, సీసీ కెమారాలు, అధార్ వంటి వాటి ద్వారా ప్రభుత్వ సేవల్లో, ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాం.
• ప్రజల సమాచారాన్ని రియల్‌టైంలో మానిటరింగ్, అనాలసిస్ చేయడం ద్వారా పాలన మెరుగు అవుతుంది.
• వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మా విధానం.
• గతంలో చేపట్టిన హ్యాపీ సండే వంటి కార్యక్రమాలు మళ్లీ నిర్వహిస్తాం. హ్యాపీ సండే, కమ్యూనిటీ ఫ్రెండ్ షిప్ వంటి కార్యక్రమాలతో ప్రజల మధ్య అనుబంధాలు, స్నేహాలు పెంచుతాం.
• సెల్ ఫోన్లకు ప్రజలు బానిసల్లా మారిపోతున్నారు. లైఫ్ మరీ మెకానికల్‌గా అయిపోతుంది.
• మనం ఆనందంగా ఉండడంతో పాటు పక్కవాళ్లు కూడా ఆనందంగా ఉండాలి అందులో భాగమే పీ4.
• పీ4 విధానంపై కాన్సెప్ట్ పేపర్‌ను విడుదల చేస్తాం. ఉన్నతస్థానాల్లో ఉన్న వాళ్లు అట్టడుగున ఉన్న వాళ్లకు చేయూతనిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.