Devendra Fadnavis: అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

- అరాచక శక్తులకు వ్యతిరేకంగా పని చేద్దామని ఆరెస్సెస్‌ను కోరామన్న ఫడ్నవీస్
- నకిలీ కథనాలను అంతం చేయడంలో ఆరెస్సెస్ సహకారం అందించిందని వెల్లడి
- మహావికాస్ అఘాడి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిందన్న ఫడ్నవీస్
- లోక్ సభ ఎన్నికల్లో తాము కూడా అతివిశ్వాసంతో ఉన్నామన్న ఫడ్నవీస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆరెస్సెస్ విచార్ పరివార్ అందించిన సహకారంతో తాము నకిలీ కథనాలను అంతం చేయగలిగామని, అందుకే లోక్ సభ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సాధించామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. అరాచక శక్తులకు వ్యతిరేకంగా జాతీయ శక్తులన్నీ ఏకతాటిపై పని చేయాల్సిన అవసరం ఉందని తాము ఆరెస్సెస్‌ను కోరడంతోనే సహకరించిందన్నారు.
తప్పుడు కథనాలతో అధికారంలోకి వస్తామని మహావికాస్ అఘాడి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిందన్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో తాము కూడా అతివిశ్వాసంతోనే ఉన్నామని, అదే సమయంలో రాజ్యాంగాన్ని మార్చేస్తారని ప్రతిపక్షాలు తమపై అసత్య ప్రచారం చేశాయని వెల్లడించారు. దురదృష్టవశాత్తూ ఈ ప్రభావం పడి లోక్ సభ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదన్నారు.
శరద్ పవార్ మిమ్మల్ని ప్రశంసించారని మీడియా ప్రతినిధి వ్యాఖ్యానించగా, ఫడ్నవీస్ స్పందిస్తూ... పవార్ సాహెబ్ చాలా స్మార్ట్ అని, అయితే కొన్నిసార్లు మన పోటీదారులను ప్రశంసించే పరిస్థితులు కూడా ఉంటాయన్నారు. అందుకే ఆయన అలా చేసినట్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. 2019-2024 మధ్య రాజకీయాలను చూశాక... రాజకీయాల్లో అలా ఎన్నటికీ జరగదని భావించకూడదని తనకు అర్థమైందని, అక్కడి వారు ఇక్కడకు రావొచ్చు.. ఇక్కడి వారు అక్కడకు వెళ్లవచ్చని వ్యాఖ్యానించారు.