Viral News: ఐటీ సోదాల్లో బయటపడ్డ మొసళ్లు.. షాక్‌కు గురైన అధికారులు

- ఓ వ్యాపారి నివాసంలో ఐటీ సోదాలు నిర్వహిస్తుండగా గుర్తింపు
- ఐటీ అధికారుల సమాచారంతో వెళ్లి కాపాడిన ఫారెస్ట్ అధికారులు
- మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించిన ఆదాయ పన్ను విభాగం అధికారులు షాక్‌కు గురయ్యారు. బీడీ తయారీదారు, భవన నిర్మాణ కాంట్రాక్టర్ అయిన బీజేపీ మాజీ కార్పొరేటర్ రాజేశ్ కేసర్వాణికి చెందిన నివాసంలో అధికారులు కొన్ని మొసళ్లను గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫారెస్టు ఆఫీసర్లు అక్కడికి చేరుకొని మొసళ్లను రక్షించారు.
ఐటీ అధికారుల నుంచి సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి వన్యప్రాణులను రక్షించామని మధ్యప్రదేశ్ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ అసీమ్ శ్రీవాస్తవ తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసులు నమోదు చేశామని, తదుపరి చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. మొసళ్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుందని, కోర్ట్ ఆదేశాల ప్రకారం కేసులో ముందుకు వెళ్తామని శ్రీవాస్తవ వివరించారు.
అయితే, రాజేశ్ కేసర్వాణి నివాసంలో ఎన్ని మొసళ్లను రక్షించారనే విషయాన్ని శ్రీవాస్తవ చెప్పలేదు. వ్యాపారి అయిన రాజేశ్‌కు సంబంధించిన స్థలాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడిందని అన్నారు. నాలుగు మొసళ్లను రక్షించినట్టు అటవీశాఖ వర్గాలు తెలిపినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.