Devendra Fadnavis: కొన్నిసార్లు మన పోటీదారులను కూడా ప్రశంసించాల్సిన పరిస్థితి ఉంటుంది: శరద్ పవార్ వ్యాఖ్యలపై ఫడ్నవిస్ స్పందన

- మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఆరెస్సెస్ కారణమన్న శరద్ పవార్
- ఆరెస్సెస్ సహకారంతో విపక్షాల తప్పుడు ప్రచారాలను అంతం చేశామన్న ఫడ్నవిస్
- రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని వ్యాఖ్య
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఆరెస్సెస్ కారణమని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ స్పందించారు. తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలతో అధికారంలోకి రావాలని మహావికాస్ అఘాడీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిందని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ప్రతిక్షాలు చేసిన ప్రచారం ఎన్నికల్లో ప్రభావం చూపదని తాము భావించామని చెప్పారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో అరాచక శక్తులకు వ్యతిరేకంగా జాతీయ శక్తులన్నీ ఏకతాటిపై పనిచేయాల్సి ఉందని ఆరెస్సెస్ ను తాము అభ్యర్థించామని ఫడ్నవిస్ తెలిపారు. ఆరెస్సెస్ అందించిన సహకారంతో విపక్షాల కథనాలను తాము అంతం చేయగలిగామని చెప్పారు. శరద్ పవార్ సాహెబ్ చాలా స్మార్ట్ అని... కొన్నిసార్లు మన పోటీదారులను కూడా ప్రశంసించే పరిస్థితి ఉంటుందని అన్నారు. 2019 నుంచి 2024 మధ్య తాను గమనించింది ఏమిటంటే... ఎన్నటికీ జరగదు అనే మాట రాజకీయాల్లో పని చేయదని చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని అన్నారు. అక్కడి వాళ్లు ఇక్కడకు రావచ్చని, ఇక్కడి వాళ్లు అక్కడకు వెళ్లొచ్చని చెప్పారు.