Donald Trump: ట్రంప్‌కు కోర్టులో భారీ ఊరట

- హష్ మనీ కేసులో తీర్పు వెల్లడించిన న్యూయార్క్ కోర్టు
- జైలు, జరిమానా, ప్రొబేషన్ లాంటి శిక్ష లేకుండా బేషరతుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన న్యాయమూర్తి
- ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయస్థానం భారీ ఊరటను కలిగించింది. హష్ మనీ కేసులో శుక్రవారం న్యూయార్క్ కోర్టు తీర్పు వెలువరించింది. హష్ మనీ కేసులో దోషిగా తేల్చినప్పటికీ ఆయన జైలుకు వెళ్లాల్సిన అవసరం, జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నెల 20న ఆయన దేశ అత్యున్నత అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
డొనాల్డ్ ట్రంప్‌కు జైలు, జరిమానా, ప్రొబేషన్ లాంటి శిక్షలను న్యూయార్క్ కోర్టుల జడ్జి జువన్ ఎం మెర్చన్ ప్రకటించలేదు. బేషరతు విడుదల (అన్ కండిషనల్ డిశ్చార్జి) చేస్తున్నట్లుగా న్యాయమూర్తి తెలిపారు. న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం .. జైలు, జరిమానా, ప్రొబేషన్, కస్టడీ లేకుండా శిక్ష విధిస్తే దాన్ని బేషరతు విడుదల అంటారు. ఇది తేలికపాటి శిక్ష.
ఈ కేసులో 34 అభియోగాల కింద గతేడాది ట్రంప్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. శృంగారతార స్టార్మీ డేనియల్‌కు లక్షా 30వేల డాలర్లు తన మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్ ద్వారా చెల్లించి వాటిని రికార్డుల్లో చూపించలేదన్నది ట్రంప్‌పై అభియోగం.