Modi Podcost: ఏదో ఒక రోజు ఇండియా ముందు మోకరిల్లుతారని 20 ఏళ్ల క్రితమే చెప్పాను.. 2005 నాటి తన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న మోదీ

 Modi Remembers What He Said In 2005 About Indian Visa

  • జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో మోదీ పాడ్‌కాస్ట్
  • 2005లో నరేంద్రమోదీకి వీసా నిరాకరించిన అమెరికా
  • ఏదో ఒక రోజు భారత వీసా కోసం ప్రపంచం క్యూ కడుతుందన్న మోదీ
  • ఇప్పుడు అదే జరుగుతోందని గుర్తు చేసుకున్న ప్రధాని
  • ‘మినిమమ్ గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్’ను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన
  • సాంకేతికతను ప్రజాస్వామీకరించడం ఎలాగో ప్రపంచానికి నేర్పామన్న మోదీ

భారతీయ వీసా కోసం ప్రపంచం ఎదురుచూస్తూ నిలబడే రోజు వస్తుందని ఆనాడు తాను చెప్పానని, ఇప్పుడది నిజమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా తనకు వీసా ఇచ్చేందుకు నిరాకరించడాన్ని గుర్తు చేసుకున్న మోదీ.. ‘‘ఆ రోజు నేను మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఇండియన్ వీసా కోసం నిలబడే రోజు వస్తుందని చెప్పాను. 2005లో నేను ఈ మాట అన్నాను. ఇప్పుడు 2025లో అది మనం చూస్తున్నాం. ప్రపంచం మారుతోందని, ఎన్నారైలు దేశానికి తిరిగి రాకుంటే చాలా బాధపడతారని అప్పుడు నేను బహిరంగంగానే చెప్పాను’’ అని మోదీ పేర్కొన్నారు.

కువైట్ సందర్శన సందర్భంగా ఇటీవల తాను ఓ లేబర్ కాలనీకి వెళ్లానని, అక్కడో లేబర్ తనతో మాట్లాడుతూ ఇండియాలోని తన జిల్లాకు అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడు వస్తుందని అడిగాడని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇదే ఆకాంక్ష 2047 నాటికి ఇండియాను వికసిత్ భారత్‌గా మారుస్తుందని పేర్కొన్నారు. తాను చెప్పే ‘మినిమమ్ గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్’ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. మినిమమ్ గవర్నమెంట్ అంటే తక్కువ మంది మంత్రులు, తక్కువ మంది ఉద్యోగులు ఉంటారని అనుకున్నారని, కానీ దాని ఉద్దేశం అది కాదని వివరించారు. పనిలో వేగం పెంచడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. 

తాను 1,500 పాత చట్టాలు రద్దు చేశానని, కొన్ని విషయాలను నేరంగా పరిగణించే చట్టాలను మార్చానని మోదీ తెలిపారు. ‘మినిమమ్ గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్’ అంటే ఇదేనని పేర్కొన్నారు. 10 కోట్ల మంది రైతులకు 30 సెకన్లలో డబ్బులు బదిలీ చేశానని, 13 కోట్ల మంది ప్రజలకు 30 సెకన్లలో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వేస్తున్నట్టు చెప్పారు. సాంకేతికతను ప్రజాస్వామీకరించడం ఎలాగో ప్రపంచానికి మన దేశం నేర్పిందని చెప్పారు. ఇందుకు కావాల్సిందల్లా ఒక్క మొబైల్ మాత్రమేనని పేర్కొన్నారు. ఇది సాంకేతికతతో నడిచే శతాబ్దమని మోదీ వివరించారు. 

More Telugu News