AP CS: త్వరలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు: ఏపీ సీఎస్ విజయానంద్
- ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన సీఎస్ విజయానంద్
- ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారం
- సీఎం ఆశయాలకనుగుణంగా పనిచేయాలన్న సీఎస్ విజయానంద్
వాట్సప్ ద్వారా త్వరలో 150 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి వీలుగా ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని అందించాలని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేసి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రభుత్వ శాఖలో మెరుగైన ఫలితాలు రాబట్టడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయన్నారు. ఇకపైన తానే ఆర్టీజీఎస్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని అన్నారు.
పౌరులకు ప్రభుత్వ సేవలను పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు వాట్సప్ గవర్నెన్స్‌ను తీసుకురావాలని సంకల్పించారన్నారు. వాట్సప్ గవర్నెన్స్‌కు సంబంధించి పనులు ఎంత మేరకు వచ్చాయని ఆయన ఆర్టీజీఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ స్పందిస్తూ వాట్సప్ గవర్నెన్స్‌కు సంబంధించి అన్ని పనులు దాదాపుగా పూర్తి చేశామన్నారు. దానికి సంబంధించి డెమోను సీఎస్‌కు చూపించారు.
150 రకాల సేవలను ప్రజలకు దీని ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దాంతో పాటు ప్రజలు తమ ఫిర్యాదులు కూడా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా చేసే వీలు కల్పిస్తున్నామని చెప్పారు. వాట్సప్ గవర్నెన్స్ ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యేలా ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లో ఉండేలా చూడాలని సీఎస్ ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖతోనూ ఆర్టీజీఎస్ సమన్వయం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
ఆర్టీజీఎస్ వద్ద ఉన్న ఇన్నోవేషన్ టెక్నాలజీలను ఆయా శాఖలకు పంపి, ఆర్టీజీఎస్ నుంచి వారు ఇంకా ఏమి కావాలని కోరుకుంటున్నారో వారితో నేరుగా చర్చించి, ఆయా శాఖల అవసరాలకు అనుగుణంగా సాధ్యమైనంతమేర సాంకేతిక సహకారం అందివ్వాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో లోపాలను ఎత్తి చూపడం కాకుండా వాటి పనితీరు మరింత మెరుగవ్వడానికి ఆర్టీజీఎస్ దోహదపడేలా తన సాంకేతిక సదుపాయాలను అందించాలన్నారు.
ఆర్టీజీఎస్ నుంచి ప్రతి శాఖకు ఒక ప్రతినిధిని పంపి అక్కడి శాఖాధిపతి, అధికారులతో చర్చించి పౌరులకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఆ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటికి సాంకేతిక పరిష్కారాలు కనుగొని ఆయా శాఖల పనితీరు మెరుగవ్వడానికి దోహదపడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు.