jagananna colonyes: కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం .. జగనన్న కాలనీల పేరూ మార్పు

- వైఎస్ జగన్‌కు మరో షాక్
- ఇక జగనన్న కాలనీలు పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్‌లుగా మార్పు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
జగన్‌కు షాక్ ఇచ్చేలా ఏపీలోని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మరో కార్యక్రమం పేరును ప్రభుత్వం మార్చేసింది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. గ్రామాల్లో పెద్ద ఎత్తున పేదలకు సెంటు భూమి చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించి జగనన్న కాలనీలుగా నామకరణం చేసింది.
అయితే ఈ జగనన్న కాలనీల పేరును తాజాగా ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీల పేరును ‘పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్’లుగా మార్పు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అధికంగా నిధులు కేటాయిస్తున్నా నాటి వైసీపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ పథకం పేరు పెట్టకుండా జగనన్న కాలనీలంటూ నామకరణం చేసింది.
ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాల పేర్లను మార్చారు. వైఎస్ జగన్, వైఎస్ఆర్ పేర్లతో ఉన్న పలు పథకాల పేర్లను మార్పు చేసిన సంగతి తెలిసిందే. పేర్లు మార్చిన ఆ పథకాలకు స్వాతంత్య్రోద్యమ నాయకులు, సంఘ సంస్కర్తల పేర్లను పెట్టారు. ఈ క్రమంలోనే జగనన్న కాలనీల పేర్లను కూడా పీఎంఏవై- ఎన్టీఆర్ నగర్‌లుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విదేశీ విద్యాదీవెన వంటి పథకాలకు పేర్లను ప్రభుత్వం మార్చేసింది.