Harish Rao: 'గేమ్ ఛేంజర్' సినిమా అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపుపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం

Harish Rao slams Revanth Reddy for giving special previlages to Game Changer movie

  • సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదని రేవంత్ అన్నారన్న హరీశ్
  • అసెంబ్లీలో చెప్పిన మాటలకు కూడా విలువ లేకపోతే ఎలాగని ప్రశ్న
  • రేవంత్, కోమటిరెడ్డిలపై ప్రివిలేజ్ మోషన్ పెడతామన్న హరీశ్

'గేమ్ ఛేంజర్' సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఒక మహిళ మృతి చెందారని... ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని... రెండు వారాలు కూడా తిరగక ముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని విమర్శించారు. రేవంత్ తీరు చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గు పడుతుందని అన్నారు. టికెట్ రేట్లు పెంచేదే లేదని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు కూడా నీటి మూటలయ్యాయని అన్నారు. 

అసెంబ్లీలో చెప్పిన మాటలకు కూడా విలువ లేకపోతే ఎలాగని హరీశ్ ప్రశ్నించారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించడం సభను అవమానించడమే అవుతుందని... రేవంత్, కోమటిరెడ్డిలపై ప్రివిలేజ్ మోషన్ పెడతామని అన్నారు. మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పి... ఇప్పుడు టికెట్ రేట్ల పెంపుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగారు. ఒక మహిళ మృతి చెందిన దురదృష్టకర ఘనటను మరువక ముందే యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News