Bandi Sanjay: కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌కు కప్పం కడుతున్నందుకే రేవంత్ రెడ్డి ఏమీ చేయలేకపోతున్నారా?: బండి సంజయ్

Bandi Sanjay questions Revanth Reddy over KTR comments

  • ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టైతే ఆందోళనలు ఎందుకు చేయాలని ప్రశ్న
  • కేటీఆర్ స్వతంత్ర సమరయోధుడా? అని ఆగ్రహం
  • కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఎందుకు ఉంటున్నాడని ప్రశ్న

కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి కప్పం కడుతున్నందుకే రేవంత్ రెడ్డి వారిని ఏమీ చేయలేకపోతున్నారా? అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టైతే ఆందోళనలు ఎందుకు చేయాలని ప్రశ్నించారు. కేటీఆర్ ఏమైనా స్వతంత్ర సమరయోధుడా? అని నిలదీశారు. ప్రభుత్వ సొమ్మును అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు.

ఇప్పుడేమో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫార్ములా ఈ-రేసులో కేబినెట్ ఆమోదం లేకుండానే విదేశీ కంపెనీకి అత్యవసరంగా కోట్లాది రూపాయలను విడుదల చేయాల్సిన అవసరం ఏం వచ్చిందన్నారు. ఫార్ములా ఈ రేస్‌తో ప్రభుత్వానికి రూ.700 కోట్లు లాభం వచ్చిందని కేటీఆర్ అంటున్నారని, మరి ఆ లాభాలు ఎక్కడ వచ్చాయో చూపించాలని సవాల్ విసిరారు.

లొట్టపీసు సీఎం... లొట్టపీసు ప్రభుత్వమని కేటీఆర్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడని నిలదీశారు. కేటీఆర్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కేటీఆర్ అడ్డగోలుగా తిడుతున్నా పట్టించుకోకపోవడానికి కారణమేమిటన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పెద్దలకు కప్పం కడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

  • Loading...

More Telugu News