Robin Uthappa: యువరాజ్ సింగ్ కెరీర్‌ ముందుగానే ముగియడానికి కోహ్లీనే కారణం.. రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు

Robin Uthappa has held Virat Kohli indirectly responsible for cutting short Yuvraj Singhs international career

  • యూవీ ఫిట్‌నెస్ మినహాయింపులు అడిగితే కోహ్లీ ఒప్పుకోలేదన్న ఉతప్ప
  • క్యాన్సర్‌ను జయించిన వ్యక్తి అని తెలిసి కూడా సడలింపు ఇవ్వలేదంటూ మండిపాటు
  • జట్టులో జరిగిన విషయాలను తాను గమనించానంటూ ఉతప్ప వెల్లడి 

టీమిండియా మాజీ క్రికెటర్, టీ20 వరల్డ్ కప్-2007 గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కాస్త ముందుగానే ముగిసిపోవడానికి విరాట్ కోహ్లీయే పరోక్ష బాధ్యుడు అని వ్యాఖ్యానించాడు. యూవీ క్యాన్సర్ నుంచి కోలుకున్నాక జట్టులోకి పునరాగమనం చేశాడని, అయితే ఫిట్‌నెస్ విషయంలో కాస్త మినహాయింపులు ఇవ్వాలని కోరినప్పటికీ నాడు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఒప్పుకోలేదని ఉతప్ప వ్యాఖ్యానించాడు.

‘‘యువరాజ్ సింగ్ క్యాన్సర్‌ను ఓడించాడు. మన దేశం రెండు వరల్డ్ కప్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జట్టు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి సహకరించాలి. క్యాన్సర్ కారణంగా అతడి ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయిందని మీకు తెలుసు. అతడి ఇబ్బందులను మీరు స్వయంగా చూశారు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొన్ని ప్రమాణాలను పాటించాలనేది నిజమే. కానీ నిబంధనల విషయంలో ఎల్లప్పుడూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. ముఖ్యంగా యువరాజ్ సింగ్ మినహాయింపులకు అర్హుడు. అతడు కేవలం క్రికెట్ వరల్డ్ కప్‌లనే కాదు, క్యాన్సర్‌ను కూడా జయించాడు. ఈ విషయాలు నాతో ఎవరూ చెప్పలేదు. నేనే గమనించాను’’ అని ఉతప్ప పేర్కొన్నాడు. హిందీ న్యూస్ మీడియా సంస్థ ‘లల్లన్‌టాప్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాగా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారతదేశ అత్యుత్తమ ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ దిగ్గజం ఎస్ఎం ధోనీ నాయకత్వంలోని 2011లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలవడంతో యూవీ కీలక పాత్ర పోషించాడు. ఇక 2007 టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కూడా ముఖ్యపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో చెలరేగి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది పెనుసంచలనం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా క్యాన్సర్ బారినపడ్డాడు. క్యాన్సర్‌ను జయించి భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. రీఎంట్రీలో ఇంగ్లండ్‌పై వన్డేలో సెంచరీ కూడా బాదాడు. అయితే, 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో, సెలక్టర్లు యూవీని విస్మరించడం మొదలుపెట్టారు. పర్యవసానంగా, 2019లో రిటైర్‌మెంట్ ప్రకటన చేశాడు.

  • Loading...

More Telugu News