Yuzvendra Chahal: విడాకుల వార్తలపై చాహల్ ఏమన్నాడంటే..!

Yuzvendra Chahal breaks silence amid rumours of divorce with Dhanashree Verma

  • తన వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి
  • అభిమానుల నుంచి మద్దతుతోనే తానీ స్థాయికి ఎదిగానన్న చాహల్
  • మీ నుంచి మద్దతు కోరుకుంటానే తప్ప సింపతీని కాదని వ్యాఖ్య

ప్రముఖ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన విడాకుల ప్రచారంపై తాజాగా స్పందించాడు. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారానికి దూరంగా ఉండాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. నిరాధార ఆరోపణలు, ఊహాగానాలను నమ్మొద్దని, ప్రచారం చేయొద్దని కోరాడు. ఇలాంటి పోస్టుల వల్ల తనతో పాటు, తన కుటుంబం బాధపడుతోందని చెప్పుకొచ్చాడు. అభిమానుల మద్దతు, ప్రేమ వల్లే తానీ స్థాయికి చేరుకున్నానని వివరించాడు. అభిమానుల నుంచి ఎల్లప్పుడూ మద్దతునే కోరుకుంటాను తప్ప వారి నుంచి సింపతీని ఆశించబోనని స్పష్టం చేశాడు.

క్రికెటర్ గా దేశం కోసం, భారత జట్టు కోసం, అభిమానుల కోసం మరిన్ని ఓవర్లు బౌల్ చేయాల్సి ఉందని చాహల్ పేర్కొన్నాడు. క్రికెటర్ గా దేశం కోసం ఆడుతున్నందుకు తాను ఎంతో గర్విస్తున్నానని, అదే సమయంలో తాను ఓ కొడుకును, ఓ సోదరుడిని, ఓ స్నేహితుడిని కూడా అని గుర్తుచేశాడు. తనను అభిమానించే వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, తన వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలను (అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు) ప్రచారం చేయొద్దని చాహల్ విజ్ఞప్తి చేశాడు. ఎల్లప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకోవాలని తన కుటుంబం తనకు నేర్పిందని, కుటుంబ విలువలకు తాను కట్టుబడి ఉంటానని తెలిపాడు. ఈమేరకు యుజ్వేంద్ర చాహల్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.

  • Loading...

More Telugu News