Bank Staff: బ్యాంకులో పని ఒత్తిడి తట్టుకోలేక.. బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళా ఉద్యోగి

Bank Assistant Manager Suicide In Bachupally Hyderabad

  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • హైదరాబాద్ లోని బాచుపల్లిలో విషాదం
  • పని ఒత్తిడి ఎక్కువగా ఉందంటూ వాపోయిందంటున్న బంధువులు

హైదరాబాద్ లోని బాచుపల్లిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. బ్యాంకులో పని ఒత్తిడి తట్టుకోలేక అసిస్టెంట్ మేనేజర్ ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. బ్యాంకు నుంచి తిరిగి వచ్చి తను ఉంటున్న అపార్ట్ మెంట్ పైనుంచి దూకారు. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కాసేపటికే ఆమె మరణించారు. మృతురాలి భర్త, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురానికి చెందిన కోట సత్యలావణ్య (32), బత్తుల వీరమోహన్ దంపతులు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. సత్యలావణ్య బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుండగా.. వీరమోహన్ ఐటీ జాబ్ చేస్తున్నారు. ఈ దంపతులు బాచుపల్లిలోని కేఆర్ సీఆర్ కాలనీలోని ఎంఎన్ రెసిడెన్సీలో ఉంటున్నారు.

బ్యాంకులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని సత్యలావణ్య కొంత కాలంగా వాపోతోందని వీరమోహన్ చెప్పారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగకు శుక్రవారం సొంతూరుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆయన వివరించారు. గురువారం మధ్యాహ్నం బ్యాంకులో పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్లిన సత్యలావణ్య.. నేరుగా ఎంఎన్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ కు చేరుకుని టెర్రస్ పైకి వెళ్లారు. అక్కడి నుంచి కిందకు దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న సత్యలావణ్యను స్థానికులు ఎస్ఎల్ జీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె పరిస్థితి విషమించిందని, చికిత్స అందించినా కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News