P.Jayachandran: ‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా’ పాట పాడిన స్టార్ సింగర్ జయచంద్రన్ కన్నుమూత
- తెలుగులో పలు గుర్తుండిపోయే పాటలు పాడిన జయచంద్రన్
- అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
- దక్షిణాది భాషలు, హిందీతో కలిపి 16 వేలకు పైగా పాటలు పాడిన గాయకుడు
- 1986లో బెస్ట్ మేల్ సింగర్‌గా జాతీయ అవార్డు
‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాటతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన గాయకుడు పి.జయచంద్రన్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి త్రిసూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
కేరళకు చెందిన జయచంద్రన్ మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో 16 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగులో ఆయన పాడిన సూర్యవంశం సినిమాలోని ‘రోజావే చిన్నీ రోజావే’, సుస్వాగతం సినిమాలోని ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డేలు’, నువ్వే కావాలి సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది’ పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. ఇప్పటికీ అవి జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి. 2002లో విడుదలైన 'ఊరు మనదిరా' సినిమాలోని ‘నా చెల్లి చంద్రమ్మ’ పాట తెలుగులో ఆయన పాడిన చివరి సాంగ్.
జయచంద్రన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1986లో శ్రీ నారాయణ గురు సినిమాలోని పాటకు గాను బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే, రెండు తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్ అవార్డులు కూడా అందుకున్నారు. ఇళయరాజా, ఏఆర్ రహమాన్, ఎంఎం కీరవాణి, విద్యాసాగర్, కోటి తదితరుల సంగీత దర్శకత్వంలో జయచంద్రన్ ఎన్నో పాటలు పాడారు. అంతేకాదు, ‘నఖక్ష తంగళ్’, ‘త్రివేండ్రం లాడ్జ్’ వంటి మలయాళ సినిమాల్లో చిన్న పాత్రలు కూడా పోషించారు.