KTR: లుచ్చాగాళ్ల ముందు తల వంచను.. కేసీఆర్ కొడుకుగా చెపుతున్నా: విచారణకు వెళ్లే ముందు మీడియాతో కేటీఆర్
- తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికే ఫార్ములా ఈ-కార్ రేసు అన్న కేటీఆర్
- అర పైసా అవినీతి కూడా చేయలేదని వ్యాఖ్య
- రేవంత్ రెడ్డి మాదిరి లుచ్చా పనులు చేయలేదన్న కేటీఆర్
- రాష్ట్రం కోసం అవసరమైతే చచ్చిపోతానని వ్యాఖ్య
ఏసీబీ విచారణ కోసం తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు. తన ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ఇంటి నుంచి వెలుపలకు వచ్చారు. అనంతరం అక్కడున్న మీడియాతో మాట్లాడి... ఏసీబీ కార్యాలయానికి బయల్దేరారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి వెళ్లారు.
"తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కార్యకర్తగా, కేసీఆర్ సైనికుడిగా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచడానికి, హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలపడానికి మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశా. తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికే ఫార్ములా ఈ-కార్ రేసు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మా బావమరుదులకు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు. కాంట్రాక్టులు ఇచ్చి ల్యాండ్ క్రూజర్లు తీసుకోలేదు. నేను అర పైసా అవినీతి కూడా చేయలేదు.
బురద చల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది. నా మీద కేసు పెట్టి, నన్నేదో చేయాలనుకుంటున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మేము భయపడే ప్రసక్తే లేదు. లుచ్చాగాళ్ల ముందు తలవంచను. ఇంకా ఎన్ని కేసులైనా పెట్టుకో. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. న్యాయపరంగా అన్నింటినీ ఎదుర్కొంటాం.
క్విడ్ ప్రోకో చేయలేదు. ఏ తప్పు చేయలేదు. నీలాగా లుచ్చా పనులు, తుచ్చ పనులు చేయలేదు రేవంత్ రెడ్డీ. నీలాగా అడ్డంగా దొరికిపోయిన దొంగను కాను. నిజం నిలకడ మీద తెలుస్తుంది. కేసీఆర్ కొడుకుగా చెపుతున్నా. తెలంగాణ కోసం అవసరమైతే చచ్చిపోతా" అని కేటీఆర్ అన్నారు.