Champions Trophy 2025: గత 417 రోజులుగా జట్టుకి దూరంగా ఉన్న ఆటగాడిపై బీసీసీఐ సెలక్టర్ల దృష్టి!
- సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై కన్నేసిన బీసీసీఐ సెలక్టర్లు
- నిశితంగా పరిశీలిస్తున్న వైద్యులు
- చివరిగా 2023 వన్డే వరల్డ్ కప్‌లో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన షమీ
- చీలమండ గాయంతో కొన్నాళ్లు దూరంగా ఉన్న స్టార్ పేసర్
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే దేశాలు తమ జట్లను ప్రకటించడానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఐసీసీ డెడ్‌లైన్ ప్రకారం జనవరి 12 లోగా జట్లు తమ ఆటగాళ్ల జాబితాను వెల్లడించాల్సి ఉంటుంది. టీమ్ ఎంపికకు సమయం దగ్గర పడడంతో జట్టులోకి ఎంపికయ్యే ఆటగాళ్లు ఎవరనే ఉత్కంఠ టీమిండియా క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై గత కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది. టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీపై బీసీసీఐ సెలక్టర్లు కన్నేశారని ‘క్రిక్‌బజ్’ తెలిపింది. ఈ స్టార్ పేసర్‌ని బీసీసీఐ వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంది.
మహ్మద్ షమీ దాదాపు 417 రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. చివరిగా వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడాడు. మెగా టోర్నీలో చీలమండ గాయమవ్వడంతో లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత కోలుకొని ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. నిజానికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి షమీని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారు. కానీ, మోకాలిలో వాపు రావడంతో పక్కన పెట్టాల్సి వచ్చింది.
ఇదిలావుంచితే, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే జట్టుని బీసీసీఐ రేపు (శుక్రవారం) ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ గడువు తేదీకి రెండు రోజుల ముందుగానే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాలని యోచిస్తున్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి.