Ramcharan: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాల వద్దకు అభిమానులను పంపించిన రామ్ చరణ్
- ఇటీవల రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానుల మృతి
- రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించిన రామ్ చరణ్
రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని తిరిగివస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఇద్దరు అభిమానులు మృతి చెందడం తెలిసిందే. గాజులూరుపాడు ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాదంలో రామ్ చరణ్ అభిమానులు అరవపల్లి మణికంఠ (23), తొక్కాడ చరణ్ (22) మరణించారు.
ఈ ఘటనపై రామ్ చరణ్, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ ఘటన తర్వాత, ఆయన ఇరువురి కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం ప్రకటించారు. ఆయన ఆ నగదును ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా మృతుల కుటుంబాలకు బదిలీ చేశారు. తాజాగా ఆయన తన అభిమానులను మృతుల కుటుంబాల వద్దకు పంపారు. రామ్ చరణ్ అభిమానులు నేడు మణికంఠ, చరణ్ ల కుటుంబాలను కలిసి రామ్ చరణ్ సందేశాన్ని అందించారు.
వారు మణికంఠ తల్లి అరవపల్లి భవాని, చరణ్ తండ్రి తొక్కాడ అప్పారావులను కలిసి తమ సంతాపాన్ని తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.