Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం... కేంద్రం కొత్త పథకం

Nitin Gadkari announces nationwide cashless treatment for road accident victims starting March

  • మార్చి నెలలో దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న స్కీమ్
  • రోడ్డు ప్రమాదం జరిగిన ఏడు రోజుల వరకు వైద్యం
  • వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందేలా చూడడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ పథకం కింద రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యాన్ని పొందవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఈ పథకం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిన 7 రోజుల దాకా రూ.1.5 లక్షల వరకు వైద్యాన్ని పొందే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. అన్ని రకాల రోడ్లపై మోటారు వాహనాల కారణంగా జరిగే ప్రమాదాలకు ఇది వర్తిస్తుందని గడ్కరీ వివరించారు.

రోడ్డు ప్రమాదం తర్వాత బాధితులకు అత్యంత కీలకమైన ‘గోల్డెన్ అవర్’ సమయంలో వైద్య సహాయాన్ని అందించడమే ఈ పథకం లక్ష్యమని గడ్కరీ తెలిపారు. నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్ఏ) ఈ స్కీమ్‌ను అమలు చేస్తుందని తెలిపారు. పోలీసులు, హాస్పిటల్స్, ప్రభుత్వ వైద్య సంస్థల సహకారం తీసుకోనున్నట్టు గడ్కరీ వెల్లడించారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, ఈ-డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ (ఈఏడీఆర్) అప్లికేషన్‌, ఎన్‌హెచ్ఏ ట్రాన్సాక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ ఈ మూడింటితో అనుసంధానించిన ఐటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ పథకం కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు వివరించారు.

ఈ పథకం పైలట్ ప్రాజెక్టు 2024 మార్చి 14న చండీగఢ్‌లో ప్రారంభమైందని, ఆ తర్వాత ఆరు ఇతర రాష్ట్రాలకు విస్తరించామని గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఏకంగా 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News