Polavaram Project: ఏపీ పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ముప్పు? ఐఐటీ బృందంతో అధ్యయనానికి రేవంత్ రెడ్డి ఆదేశాలు
- నెల రోజుల్లో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశం
- సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్న రేవంత్ రెడ్డి
- భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపై అధ్యయనం చేయనున్న బృందం
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణ మీద పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నెల రోజుల్లో దీనికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపై ఐఐటీ హైదరాబాద్ బృందం అధ్యయనం చేయనుంది. 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో భద్రాచలం వద్ద ముంపునకు గురైనట్లు అధికారులు... ముఖ్యమంత్రికి వివరించారు.
అలాగే ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల మెగా ప్రాజెక్టు అంశాన్ని కూడా అధికారులు... సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వరద జలాల ఆధారంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు ఇంకా ఎలాంటి అనుమతులు లేవన్నారు. తెలంగాణ అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పాలని సీఎం సూచించారు.