G. Kishan Reddy: వాడుక భాషలో 70 శాతం ఆంగ్లపదాలే... తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి: కిషన్ రెడ్డి
- మాట్లాడటం, రాయడం ద్వారా భాషను పరిరక్షించుకోగలమన్న కిషన్ రెడ్డి
- తెలుగు భాష కనుమరుగు కాకముందే రక్షించుకోవాలన్న కేంద్రమంత్రి
- కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని అమలు చేయాలని సూచన
వాడుక భాషలో 30 శాతమే తెలుగు ఉందని, 70 శాతం ఆంగ్ల పదాలే ఉన్నాయని, మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... మాట్లాడటం, రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమన్నారు. పిల్లలతో నిత్యం బాలసాహిత్యం చదివించాలన్నారు.
తెలుగు భాష కనుమరుగు కాకముందే రక్షించుకోవాలన్నారు. తెలుగు భాషను బోధనా భాషగా ప్రాచుర్యంలోకి తేవాలన్నారు. పాలన, అధికార వ్యవహారాలు తెలుగు భాషలో జరగాలని సూచించారు. ప్రాథమికస్థాయి వరకు విద్య కూడా తెలుగులో ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రాంతీయ భాషల పరిరక్షణకు పెద్దల సహకారం అవసరమన్నారు.
కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు తెలుగులో ఉండాలని, కోర్టు తీర్పులు, సినిమాల పేర్లు తెలుగులోనే ఉండాలన్నారు. వికీపీడియాలో తెలుగు వ్యాసాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు చెప్పారు. కథలు, వ్యాసాలు ఆడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయన్నారు. తెలుగు భాషను డిజిటల్ విభాగంలోనూ క్రోఢీకరించి భావితరాలకు అందించాలన్నారు. డిజిటల్ రంగం పరంగానూ మాతృభాష అభివృద్ధి, సంరక్షణకు దోహదం చేయాలన్నారు.