nandamuri balakrishna: మా అమ్మాయి బ్రాహ్మణికి సినిమా ఆఫర్ వచ్చింది... అయితే...!: బాలకృష్ణ
- అన్‌స్టాపబుల్ టాక్ షో వ్యాఖ్యాతగా రాణిస్తున్న బాలకృష్ణ
- సీజన్ 4.. ఎపిసోడ్ 8లో అతిధులుగా సందడి చేసిన సినీ దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత నాగవంశీ
- తన కుమార్తె బ్రాహ్మణికి మణిరత్నం హీరోయిన్ ఆఫర్ ఇచ్చారన్న బాలకృష్ణ
అన్‌స్టాపబుల్ షో ఇండియాలోనే టాప్ టాక్ షోగా దూసుకువెళుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగానే కాకుండా టాక్ షో వ్యాఖ్యాతగానూ రాణిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'లో బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ లో దూసుకువెళుతోంది. అన్‌స్టాపబుల్ సీజన్ 4లో అనేక మంది నటీనటులు, ప్రముఖులు గెస్టుగా హాజరవుతున్నారు.
కాగా, సీజన్ 4.. ఎపిసోడ్ 8లో సినీ దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత నాగవంశీ అతిధులుగా పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ తన పెద్ద కుమార్తె బ్రహ్మణి సినీ రంగ ప్రవేశానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సంగీత దర్శకుడు తమన్ వేసిన ప్రశ్నపై బాలకృష్ణ స్పందిస్తూ .. తాను ఇద్దరు కుమార్తెలనూ గారాబంగానే పెంచానని చెప్పుకొచ్చారు. తన పెద్ద కుమార్తె బ్రాహ్మణికి అప్పట్లో ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు మణిరత్నం ఆఫర్ ఇచ్చారని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.
హీరోయిన్‌గా వచ్చిన అవకాశాన్ని తాను బ్రాహ్మణి దృష్టికి తీసుకెళ్లగా.. మై ఫేస్ (నా ముఖం) అంటూ సమాధానమిచ్చిందని, అవునూ నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని చెప్పగా, చివరకు ఆసక్తి లేదని తెలిపిందన్నారు. రెండో కుమార్తె తేజస్విని మాత్రం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేదని, దాంతో తనైనా నటి అవుతుందని తాను అనుకున్నానని చెప్పారు.
తేజస్వి ఈ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోందని బాలకృష్ణ వెల్లడించారు. ఎవరి రంగంలో వారు మంచి పేరు తెచ్చుకున్నారని, వాళ్ల తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి వారు ఎదిగారంటే అంతకు మించి నాకు కావాల్సింది ఏముంటుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.