Cancer: కేన్సర్ ముప్పును దూరం పెట్టే సహజ పదార్థాలు ఇవిగో!
- ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న కేన్సర్ బాధితులు
- జీవన శైలిలో మార్పు నుంచి దురలవాట్ల దాకా కారణాలెన్నో ఉన్నాయంటున్న నిపుణులు
- కొన్ని రకాల సహజ పదార్థాలతో కేన్సర్ ను దూరం పెట్టుకోవచ్చని సూచనలు
మారిన జీవన శైలితో కేన్సర్ల బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తినే ఆహారం నుంచి ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు, కొన్ని రకాల వ్యాధులు, జన్యుపరమైన కారణాలు... ఇలా ఎన్నో అంశాలు కేన్సర్లకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల పదార్థాలు మన శరీరంలో కేన్సర్ కారక పదార్థాలు, లక్షణాలను దూరం పెడతాయని వివరిస్తున్నారు. వైద్యులు, ఆయుర్వేద నిపుణుల సూచనల మేరకు వాటిని ఉపయోగించడం ద్వారా భవిష్యత్తులో కేన్సర్ బారినపడే ముప్పు చాలా వరకు తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు.
అశ్వగంధ... పూర్తి ఆరోగ్యం
ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. శరీరంలో శక్తిని పెంపొందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో శరీరం ఒత్తిడిని తట్టుకోవడానికి అద్భుతంగా తోడ్పడుతుందని వివరిస్తున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పదార్థాలు... మన శరీరంలో రోగ నిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తాయని, కేన్సర్ ట్యూమర్ల పెరుగుదలను నియంత్రిస్తాయని స్పష్టం చేస్తున్నారు.
తిప్పతీగ (గుడుచి లేదా గిలోయ్)... ఆయుర్వేద అద్భుతం...
మన ఆయుర్వేదం చెప్పే అద్భుతమైన మూలికలలో తిప్పతీగ ఒకటి. మన శరీరంలోని ఇమ్యూనిటీని బలోపేతం చేయడంలో, బ్యాక్టీరియాలు, వైరస్ లు వంటి సూక్ష్మజీవులను ఎదుర్కోవడంలో దీనిని మించినది లేదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఇది మన శరీరంలో కేన్సర్ కు కారణమయ్యే కణాలతో పోరాడుతుందని, పూర్తి ఆరోగ్యానికి తోడ్పడుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఉసిరి.. ప్రయోజనాలు ఎన్నెన్నో...
మన భారతీయ ఆయుర్వేదంలో అనే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా ఉసిరిని అద్భుతమైన ఔషధంగా వినియోగిస్తుంటారు. విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఉసిరి.. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కేన్సర్ కణాలను నిర్మూలించడంలో, కేన్సర్ లక్షణాలను తగ్గించడంలో బాగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.
దివ్యౌషధం వెల్లుల్లి...
మనం నిత్యం ఆహారంలో ఉపయోగించే పదార్థాల్లో ఒకటైన వెల్లుల్లి దివ్యౌషధమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో అత్యధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, దానికే ప్రత్యేకమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో శరీరానికి ఎంతో మేలు అని గుర్తుచేస్తున్నారు. వెల్లుల్లిలోని పలు రకాల రసాయన సమ్మేళనాలు.. శరీరంలో కణాలు దెబ్బతినడాన్ని నియంత్రిస్తాయని, జన్యు స్థాయిలో కణాలు మరమ్మతు చేసుకోవడంలో సాయపడతాయని నిపుణులు వివరిస్తున్నారు. పొట్ట, రొమ్ము, పాంక్రియాస్, ప్రొస్టేట్ కేన్సర్లను నియంత్రించడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు.
పసుపు.. ఎన్నో సమస్యలకు పరిష్కారం...
మనం ఇంట్లో నిత్యం వినియోగించే పసుపు సాధారణమైన ఔషధం కాదు. ఆయుర్వేదం ప్రకారం పసుపు ఒక అద్భుత ఔషధం. ఎన్నో రకాల అనారోగ్యాలకు చికిత్సతోపాటు మరెన్నో రకాల వ్యాధులు, సమస్యలను నివారించడంలో పసుపు ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులోని కర్క్యుమిన్ కు శరీరంలో కేన్సర్ కణాలను నిర్మూలించే శక్తి ఉంటుందని వివరిస్తున్నారు. మన శరీర కణాల విభజనను, ఇతర అంశాలను కూడా నియంత్రిస్తుందని పేర్కొంటున్నారు.