Revanth Reddy: ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయింది... ప్రతి నెల వస్తోన్న రాబడి సరిపోవడం లేదు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy interesting comments on income

  • ప్రతి నెలా రూ.18,500 కోట్ల ఆదాయం వస్తోంది.. కనీస అవసరాలకే రూ.22,500 కోట్లు కావాలన్న సీఎం
  • సమస్యల పరిష్కారానికి ధర్నాలే అవసరం లేదు... చర్చల ద్వారా పరిష్కారమవుతాయన్న సీఎం
  • సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదని స్పష్టీకరణ
  • రెగ్యులరైజ్ కోసం పట్టుబడితే సమస్య పెరుగుతుందన్న సీఎం

ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయిందని, ప్రతి నెల వస్తోన్న రాబడి సరిపోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిలో మార్పులు తీసుకురావడానికి కాస్త సమయం పడుతుందన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయిందని, దీంతో పలు సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నట్లు చెప్పారు.

ప్రతి నెలా ప్రభుత్వానికి రూ.18,500 కోట్ల ఆదాయం వస్తోందని, అది సరిపోవడం లేదన్నారు. కనీస అవసరాలకే ప్రతి నెల రూ.22,500 కోట్లు కావాలన్నారు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నారు. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరిస్తామన్నారు.

సమస్యల పరిష్కారానికి ధర్నాలే చేయాల్సిన అవసరం లేదన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలను, ధర్నాలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నేతల ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది ఉద్యోగులే అన్నారు.

ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సర్వశిక్షా అభియాన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే కోర్టుల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అవకాశం లేకపోయినప్పటికీ రెగ్యులరైజ్ కోసం పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని గుర్తించాలన్నారు.

  • Loading...

More Telugu News