Chandrababu: ప్రపంచ మార్కెట్ కైవసం చేసుకునే స్థాయికి తెలుగు సినీ పరిశ్రమ చేరడం గర్వకారణం: చంద్రబాబు

Chandrababu speech in World Telugu Federation meetings in Hyderabad

  • హైదరాబాదులో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
  • హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
  • గిడుగు రామ్మూర్తి, రామోజీరావు వంటి పెద్దలను స్మరించుకోవాలని వెల్లడి
  • వివిధ రంగాల్లో తెలుగువారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారని హర్షం

హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో తెలుగు భాష ఔన్నత్యాన్ని, వివిధ రంగాల్లో తెలుగు వ్యక్తుల ఘనతలను కొనియాడారు. తెలుగు భాషాభివృద్ధి కోసం శ్రద్ధ పెట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని, రామోజీరావు వంటి పెద్దలను ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీరంతా తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.

"రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, జీఎంసీ బాలయోగి, వెంకయ్యనాయుడు... సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ ఎన్వీ రమణ వంటి తెలుగు వారు తమ పదవుల్లో రాణించారు. ఇవాళ తెలుగు వారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. 

క్రీడల్లో కరణం మల్లీశ్వరితో ప్రారంభమైన ప్రస్థానం... పుల్లెల గోపీచంద్, ద్రోణవల్లి హారిక, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు, పీవీ సింధు, పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, మొన్ననే సెంచరీ కొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి వరకు ఎంతోమంది తెలుగువారు క్రీడల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. 

మరోవైపు... మొన్నటివరకు చెన్నైలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాదుకు తీసుకురావాలని మేమంతా ప్రయత్నాలు చేశాం. ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని చూస్తే భారతదేశంలోనే నెంబర్ వన్ చిత్ర పరిశ్రమగా తయారైంది. ప్రపంచ మార్కెట్ ను కైవసం చేసుకునే స్థాయికి తెలుగు చిత్ర పరిశ్రమ చేరుకోవడం మనందరికీ గర్వకారణం. 

కూచిపూడి నృత్యం గురించి చెప్పుకోవాల్సి వస్తే... ఆ కళా రూపం మన సొంతం. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా ఉన్న బతుకమ్మ కూడా ఇలాంటిదే. 

పొట్టి శ్రీరాములు సంకల్పం మనలో ఉంది... టంగుటూరి ప్రకాశం పంతులు గుండె ధైర్యం మనలో ఉంది... అల్లూరి సీతారామరాజు పౌరుషం మనలో ఉంది... ఎన్టీఆర్ ఆత్మాభిమానం మనలో ఉంది... పీవీ నరసింహారావు చాణక్యనీతి, తెలివితేటలు మనలో ఉన్నాయి... ఇవన్నీ ఉండగా నా ఆకాంక్ష ఒక్కటే. 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీ ఏదంటే... దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలనేదే నా ఆకాంక్ష. అది జరగాలంటే ఒక సంకల్పం ఉండాలి. అందుకోసం కృషి చేయాలి. 

ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవారు... కానీ ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి. ఒకప్పుడు కష్టపడి పనిచేయాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది... స్మార్ట్ గా పనిచేస్తే ఏదైనా సాధ్యమే అని చెబుతున్నా. టెక్నాలజీ వల్ల నష్టాలు ఉన్నాయి, దీని వల్ల మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయని చాలామంది అంటున్నారు. అయితే టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగిస్తే ప్రపంచాన్ని కూడా శాసించే శక్తి వస్తుంది. అదే టెక్నాలజీకి బానిసగా మారి, దుర్వినియోగం చేస్తే పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది! 

ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను ఏర్పాటు చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తాడో అంత శక్తినీ ఉపయోగించి... తెలుగుజాతిని నెంబర్ వన్ చేసేందుకు ఏమేం చేయాలో అవన్నీ చేస్తాను. 

తెలుగు జాతి అంతా ఒక్కటే... మనకు విభేదాల్లేవు. అన్ని విషయాల్లో తెలుగు వారు సమష్టిగా దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి మహాసభల వల్ల మనలో ఉన్న సంకల్పం పట్ల పునరంకితం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది" అని చంద్రబాబు వివరించారు.

  • Loading...

More Telugu News