Harish Rao: రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్‌కు ఒకేరోజు హాజరయ్యారు: హరీశ్ రావు
- సీఎంతో పాటు మంత్రులు కూడా హాజరు కావడం లేదని విమర్శ
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారని విమర్శ
- దరఖాస్తులు సమర్పించడం వృథానే అన్న హరీశ్ రావు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్‌కు ఒకే ఒకరోజు హాజరై... 10 నిమిషాలు మాత్రమే ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారని... దీనిని బట్టే ప్రజాదర్బార్ పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో వెల్లడైందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సీఎం కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టిందన్నారు. ప్రజాదర్బార్‌ను నిర్వహించకపోగా పేరు మార్చి ప్రజావాణిగా చేశారన్నారు.
ప్రజాదర్బార్‌లో మంత్రులు అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారని, కానీ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదన్నారు. మంత్రులకు గాంధీభవన్‌కు వెళ్లేందుకు ఉన్న తీరిక, ప్రజావాణికి రావడానికి మాత్రం ఉండటం లేదన్నారు. దీంతో ప్రజావాణి పట్ల మంత్రుల చిత్తశుద్ధి ఏపాటిదో కూడా తేలిపోయిందన్నారు. సీఎం రాకుండా... మంత్రులూ రాకుండా... చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
ప్రజాదర్బార్‌ను ప్రతిరోజు నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొని, ఇప్పుడు వారానికి 2 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు రోజులు కూడా ప్రజావాణికి రావడం, దరఖాస్తులు సమర్పించడం ఉత్త వృథా ప్రయాసే అవుతోందని జనం వాపోతున్నారన్నారు.
2024 డిసెంబర్ 9 నాటికి ప్రజావాణికి 82,955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారని, అయితే, అందులో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్స్ కిందకు వస్తాయని, మిగతావి గ్రీవెన్స్ పరిధిలోకి రావని చెబుతున్నారన్నారు. గ్రీవెన్స్‌కు సదరు అధికారులు ఇస్తోన్న నిర్వచనం ఏమిటంటే... ఫిర్యాదు, అన్యాయం, హక్కులకు భంగం, ప్రభుత్వ పథకాలు అందకపోవడం, అధికారులు వారి విధులు నిర్వహించకపోవడం, ప్రజలకు సిటిజన్ చార్టర్ ప్రకారం అందాల్సిన సదుపాయాలు అందకపోవడం... వీటినే గ్రీవెన్స్ కింద పరిగణిస్తామని చెబుతున్నారని తెలిపారు.
ఈ నిర్వచనం ప్రకారం భూతగాదాలు గానీ, భూనిర్వాసితుల సమస్యలు గానీ, నిరుద్యోగుల సమస్యలు గానీ, వివిధ వర్గాల పేదరిక సంబంధ సమస్యలు గానీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మొదలైన విషయాలు గ్రీవెన్స్ కిందకు రావంటూ సగం దరఖాస్తులను అధికారులు తిరస్కరించారని ఆరోపించారు. గ్రీవెన్స్ పరిధిలోకి రావని 50 శాతం ప్రజావాణి పిటిషన్లను అధికారులు తిరస్కరించినట్లు వెల్లడైందన్నారు.
అయితే, 27,215 గ్రీవెన్స్‌లు పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అది నిజం కాదన్నారు. చాలా సమస్యలను పరిష్కరించకుండానే ఫైళ్లను క్లోజ్ చేసినట్లు క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని విమర్శించారు.
సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఫైల్ క్లోజ్ చేశారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో ఆశతో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి హైదరాబాద్ వరకు వస్తే, ఆశలు అడియాసలవుతున్నాయని, పడ్డ శ్రమ వృథా అవుతోందని ప్రజలు వాపోతున్నారన్నారు.
మొత్తం మీద సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారిందని, ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమేనని తేలిపోయిందన్నారు. మేనిఫెస్టోలోని మొదటి హామీ నీటిమీది రాతగా మిగిలిపోయిందన్నారు. కాగా, తాను ఇచ్చిన సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా సేకరించినట్లు హరీశ్ రావు చివరలో పేర్కొన్నారు.