Ganapati Sachidananda Swamy: చంద్రబాబు ఒక కర్మయోగి... ఆయన అనుకున్నది నిర్విఘ్నంగా జరుగుతుంది: గణపతి సచ్చిదానంద
- విజయవాడలోని సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లిన చంద్రబాబు
- ఆశీర్వచనాలు పలికిన గణపతి సచ్చిదానంద స్వామి
- చంద్రబాబు పాలనలో కచ్చితంగా స్వర్ణాంధ్ర సాకారం అవుతుందన్న స్వామి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడారు. చంద్రబాబు ఒక కర్మయోగి అని అభివర్ణించారు. ఆయన అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ స్వర్ణాంధ్ర కావడం తథ్యమని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆయనకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
"చంద్రబాబు వంటి కర్మయోగిని ఆ భగవంతుడు మనకు మళ్లీ తీసుకువచ్చి ఇచ్చాడు. అమ్మవారు ఆయనతో ఏమేం చేయించాలనుకుందో, అవన్నీ జనసహకారంతో, పరమాత్మ యొక్క వాతావరణ సహకారంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. నిస్వార్థమైన సేవలు అందించేలా చంద్రబాబుకు, ఆయన మంత్రివర్గానికి మంచి శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని జగన్మాత అయిన గీతా మాతను ప్రార్థిస్తున్నాం" అని సచ్చిదానంద స్వామి వివరించారు.
ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వెళుతున్నారని, ఆయనకు కొంచెం సమయం ఇవ్వాలని అన్నారు. చెడు చేయాలంటే ఎంతో సమయం పట్టదని, వెంటనే చేసేయొచ్చని... కానీ మంచి పనులు చేయాలంటే సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.
ఇటీవలి వరకు మీ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదని, కానీ ఇప్పుడు మళ్లీ మన రాష్ట్రానికి రాజధాని వచ్చిందని గణపతి సచ్చిదానంద హర్షం వ్యక్తం చేశారు. నా రాజధాని అమరావతి అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలనని అన్నారు.