Satya Kumar: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ ఫైర్
- టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు పెట్టిన కొత్త సంవత్సర వేడుకలు
- మహిళల కోసం ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
- ఈవెంట్ కు వెళ్లవద్దన్న హీరోయిన్ మాధవీలత
- మాధవీలత, బీజేపీ నేతలపై మండిపడ్డ జేసీ
- వయసుకు తగ్గట్టుగా నడుచుకోవాలని జేసీకి సత్యకుమార్ హితవు
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకలు టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు పెట్టాయి. తాడిపత్రి మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ ను జేసీ నిర్వహించారు. అయితే సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఈ ఈవెంట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్ కోసం జేసీ పార్క్ వద్దకు మహిళలు వెళ్లవద్దని, అక్కడ దారుణాలు జరుగుతున్నాయని ఆమె వీడియో విడుదల చేశారు.
ఈ వ్యాఖ్యలపై జేసీ భగ్గుమన్నారు. మాధవీలత ఒక వ్యభిచారి అని, అలాంటి వాళ్లు కూడా తమ గురించి మాట్లాడతారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు చోటు చేసుకున్న తరుణంలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ఆరోపించారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే తక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు.
జేసీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యలు సరికాదని... ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని అన్నారు. జేపీ వ్యాపారాలపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయని చెప్పారు. కూటమిలో భాగమైన బీజేపీపై జేసీ అర్థంలేని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వయసుకు తగిన విధంగా నడుచుకోవాలని జేసీకి హితవు పలికారు.