Aparna Malladi: తెలుగు నటి, దర్శకురాలు అపర్ణ మృతి
- క్యాన్సర్ కారణంగా కన్నుమూసిన అపర్ణ మల్లాది
- అమెరికాలో చికిత్స పొందుతూ కన్నుమూత
- ఆమె వయసు 54 సంవత్సరాలు
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నటి, రచయిత, నిర్మాత దర్శకురాలు అపర్ణ మల్లాది క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె వయసు 54 ఏళ్లు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఆమె మరణించారు. రెండేళ్ల క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. తొలుత ట్రీట్మెంట్ కు ఆమె శరీరం సహకరించినప్పటికీ... ఆ తర్వాత చికిత్స పని చేయలేదు. దీంతో, ఆమెకు క్యాన్సర్ తిరగబెట్టింది. మెరుగైన చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన అపర్ణ... అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు.
'ది అనుశ్రీ ఎక్స్ పెరిమెంట్స్' అనే చిత్రంతో ఆమె సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత 'పోష్ పోరీస్' అనే వెబ్ సిరీస్ చేశారు. ఓటీటీలు రాకముందే చేసిన ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. రెండేళ్ల క్రితం 'పెళ్లికూతురు' అనే సినిమా చేశారు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడ్డారు.
ఎంతో మంది నటులకు, దర్శకులకు అవకాశాలు రావడానికి ఆమె ఎంతో కృషి చేశారని తెలుస్తోంది. ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులకు డైరెక్షన్ లోని మెళకువలు కూడా నేర్పించేవారు. ఆమె మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.