Vijayawada Floods: విజయవాడను కాపాడుకోవడంపై అవగాహనకు వచ్చాం: మంత్రి నిమ్మల

Ministers Nimmala and Narayana reviews on Vijayawada floods

  • గత సెప్టెంబరులో విజయవాడ నగరానికి వరదలు
  • బుడమేరుకు గండ్లు
  • నేడు సమీక్ష చేపట్టిన మంత్రులు నిమ్మల, నారాయణ
  • ఈ నెలాఖరు కల్లా సీఎం చంద్రబాబుకు పూర్తి స్థాయి నివేదిక
  • కేంద్రం నుంచి సాయం కోరాలని నిర్ణయం

కనీవినీ ఎరుగని రీతిలో గత సెప్టెంబరులో విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకోవడం తెలిసిందే. బుడమేరకు గండ్లు పడడంతో విజయవాడను జలవిలయం బారినపడింది. ఈ నేపథ్యంలో, నేడు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బుడమేరు వరద నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ, నాటి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే బుడమేరు ముంపునకు కారణం అని విమర్శించారు. బుడమేరు వరద నియంత్రణపై సీఎంకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని, ఆ మేరకు అధికారులతో సమీక్షించామని తెలిపారు. బుడమేరు వరద వల్ల విజయవాడకు తీవ్ర నష్టం వాటిల్లిందని, విజయవాడ నగరాన్ని కాపాడుకోవడంపై ఓ అవగాహనకు వచ్చామని తెలిపారు. నీటిపారుదల, రెవెన్యూ, పురపాలక శాఖలు సంయుక్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని నిధులు సమీకరించాలని నిర్ణయించినట్టు వివరించారు. 

బుడమేరు పాత కాలువ సామర్థ్యం 3 వేల క్యూసెక్కులకు పెంచాల్సి ఉంటుందని, సామర్థ్యం పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించామని మంత్రి నిమ్మల వివరించారు. సమాంతరంగా కొత్త కాలువ తవ్వేందుకు కూడా అంచనాలకు ఆదేశించామని చెప్పారు. ఉప్పుటేరు మార్గాన్ని వెడల్పు చేయడం కూడా మరో కార్యాచరణ అని తెలిపారు. 

ఈ అంశాలన్నింటిపై చర్చించేందుకు ఈ నెల 18న మరోసారి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి సమర్పించి, అనంతరం కేంద్రానికి పంపిస్తామని నిమ్మల వెల్లడించారు. సీఎం సూచనలకు అనుగుణంగా బుడమేరు కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని అన్నారు. 

వాటర్ బాటిళ్ల పంపిణీ కూడా రాజకీయం చేశారు: మంత్రి నారాయణ

మరో మంత్రి నారాయణ మాట్లాడుతూ, సెప్టెంబరులో సంభవించిన వరదల వల్ల విజయవాడ నగర ప్రజలు 4 రోజుల పాటు నీటి ముంపులోనే ఉన్నారని వెల్లడించారు. కనీసం రోజువారీ అవసరాలకు కూడా నీరు అందని పరిస్థితి ఎదుర్కొన్నారని వివరించారు. రోజుకు 20 లక్షల నుంచి 30 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని చెప్పారు. వాటర్ బాటిళ్ల పంపిణీని కూడా వైసీపీ రాజకీయం చేసిందని మండిపడ్డారు. 

ఈ నెలాఖరు కల్లా పూర్తి నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని వెల్లడించారు. బుడమేరు కాల్వపై 3,750 ఆక్రమణలు ఉన్నాయని, కాలువ సామర్థ్యం పెంచితే ప్రవాహం బయటికి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

  • Loading...

More Telugu News