Mallu Bhatti Vikramarka: ఐఐటీ హైదరాబాద్‌ విద్యాసంస్థ కాదు.. ఆవిష్కరణలకు కేంద్రబిందువు: భట్టి విక్రమార్క

IIT Hyderabad is not an educational institution it is a focal point for innovation saysBhatti Vikramarka

  • ఆవిష్కరణల కర్మాగారం అంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం ప్రశంసలు
  • ఇప్పటివరకు 11,500 పరిశోధనా ప్రచురణలు, 320 పైగా పేటెంట్లు వచ్చాయంటూ అభినందనలు
  • ‘ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్‌ మినరల్‌ రీసెర్చ్‌ హబ్‌ వర్క్‌షాప్‌’ను ప్రారంభించిన భట్టి విక్రమార్క
  • తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చుతామంటూ ప్రకటన 

ఐఐటీ హైదరాబాద్‌ ఒక విద్యాసంస్థ కాదని, ఆవిష్కరణలకు కేంద్రబిందువు అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశంసల జల్లు కురిపించారు. ఆవిష్కరణలు, అద్భుతమైన పనితీరుకు చిరునామా ఐఐటీ హైదరాబాద్ అని మెచ్చుకున్నారు. ఇది కలల కర్మాగారం అని పొగిడారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఇప్పటివరకు 11,500 పరిశోధనా ప్రచురణలు, 320 పైగా పేటెంట్లు, స్టార్టప్‌ల ద్వారా ఏకంగా రూ.1,500 కోట్ల ఆదాయం పొందిందని, ఇది చాలా అభినందనీయమైన మార్పు అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఐఐటీ హైదరాబాద్ నిర్మాణం, అభివృద్ధిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని, ఆయన సీఎంగా ఉన్నప్పుడే పునాదులు పడ్డాయని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. నాడు తాను ఎమ్మెల్సీగా ఉండి భాగస్వామిని అయ్యానని, అది తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ‘ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్‌ మినరల్‌ రీసెర్చ్‌ హబ్‌ వర్క్‌షాప్‌’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. దేశ పురోగతిలో ఐఐటీల పాత్ర చాలా కీలకమని, ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదని, దేశ నిర్మాణానికి వేదికలు అని పేర్కొన్నారు.

గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తెలంగాణ
తెలంగాణను గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా తీర్చి దిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. 2030 నాటికి 2 వేల మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుబడులు పెడతామని ఆయన చెప్పారు. ఫ్లోటింగ్‌ సోలార్‌పై కూడా ఇన్వెస్ట్‌మెంట్లు పెడతామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News