Ramcharan: రాజకీయాల నుంచి రైతన్నను కాపాడే 'గేమ్ ఛేంజర్'!

Game Changer Movie Trailer Review

  • భారీ బడ్జెట్ తో రూపొందిన 'గేమ్ ఛేంజర్'
  • ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచిన శంకర్ 
  • అన్ని హైలైట్స్ ను టేస్ట్ చేయించిన ట్రైలర్ 
  • ప్రతి అంశానికి భారీతనం తెచ్చిన శంకర్ 
  • ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్న చరణ్ లుక్స్


చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' రూపొందింది. నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా. అందువలన ఈ సినిమా సంఖ్యా పరంగా ప్రత్యేకతను సంతరించుకుంది. భారీతారాగణంతో రూపొందిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలోని 5 పాటల కోసం 75 కోట్లు ఖర్చు చేశారనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. జనవరి 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, రాజమౌళి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ - AMB మాల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంటును జరుపుకుంది.   రెండు నిమిషాల 40 సెకన్ల నిడివి కలిగిన ట్రైలర్లో  .. ఈ సినిమా కంటెంట్ ఏమిటనేది అందరికి అర్థమయ్యేలా చెప్పారనే అనాలి. అవినీతిమయమైన రాజకీయం .. రాక్షసుడిగా మారిన ఒక రాజకీయనాయకుడు. అమాయకులైన అన్నదాతలకు అన్యాయం చేయాలని చూసిన అతణ్ణి, ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కలెక్టర్ ఎలా ఎదుర్కొన్నాడనేది కథ. ఈ సినిమాలో చరణ్ అన్నదాతగా రైతు లుక్ తోను .. ఐఏఎస్ అధికారి లుక్ తోను కనిపిస్తున్నాడు. ఇక సందర్భాన్ని బట్టి మాస్ లుక్ తోను కనిపిస్తున్నాడు.

కథానాయకుడు ఒక వైపున తన కుటుంబాన్ని .. మరో వైపున సమాజాన్ని కాపాడుకోవడం కోసం ఎంత  రిస్క్ తీసుకున్నాడనేది ట్రైలర్ లో చూపించారు. శంకర్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు తెరపై అద్భుతాలు చేయనున్నాయని అర్థమవుతోంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయనే విషయం తెలుస్తోంది. ఇక సాంగ్స్ భారీ సెట్స్ ను కలుపుకుని కలర్ ఫుల్ గా కనువిందు చేయనున్నాయనేది స్పష్టమవుతోంది. సీనియర్ చరణ్ సరసన అంజలి .. జూనియర్ చరణ్ జోడిగా కియారా చేసే సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇటు గ్రామీణ నేపథ్యంలోనూ .. అటు సిటీలోను ఈ కథ నడుస్తోంది. బ్రహ్మానందం .. సునీల్ .. వెన్నెల కిశోర్ పాత్రలను కూడా ట్రైలర్ లో టచ్ చేశారు. ఈ సినిమాలో కామెడీకి కొదవలేదనే హింట్ ఇచ్చేశారు. బుర్రా సాయిమాధవ్ రాసిన పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతున్నాయి. ప్రధానమైన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై అమాంతంగా అంచనాలను పెంచుతోంది. ఇక చరణ్ గళ్ల లుంగీ కట్టుకుని హెలికాఫ్టర్ లో నుంచి కత్తి పట్టుకుని దూకడం మాస్ ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి. సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్' చేసే హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి.

  • Loading...

More Telugu News